అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ఆకస్మికరాజీనామా
న్యూఢిల్లీ: భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్(67) సోమవారం ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఇక్కడి యూఎస్ మిషన్ టౌన్‌హాల్లో సహోద్యోగులకు ఆమె ఈ విషయం వెల్లడించారు. రాజీనామాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు పంపానని, మే చివరికల్లా డెలావేర్‌లోని సొంతింటికి వెళ్లిపోయి విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. యూపీఏతో సత్సంబంధాలున్న పావెల్ ఇటీవల ప్రధాని పదవి రేసులో ముందున్న బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీని కలవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో అనవసర వివాదాలకు తావివ్వకూడదనే ఒబామా ప్రభుత్వం ఆమెతో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. కాగా, ఒబామా ప్రభుత్వంతో విభేదాల వల్లే ఆమె రాజీనామా చేశారన్న వార్తలను ఆమెరికా విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. పావెల్ 2012 ఏప్రిల్‌లో భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. అమెరికా రాయబారి ఒక పర్యాయ పదవీ కాలం సాధారణంగా రె ండేళ్లుగా ఉంటుంది.