సంబంధాలు దెబ్బతిన్నాయి
దేవయాని అరెస్ట్ వ్యవహారంపై అమెరికా రాయబారి వ్యాఖ్య
ఆ విషయంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటన
దేవయానిపై కేసు ఉపసంహరణ ప్రసక్తే లేదు: యూఎస్ అధికారవర్గాలు
న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో భారతీయ దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడే అరెస్ట్‌కు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన వైఖరి వల్ల సజావుగా సాగుతున్న అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయని భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ వ్యాఖ్యానించారు. అమెరికా తరఫున భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. దేవయాని అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల పట్ల నాన్సీ విచారం వ్యక్తం చేశారు. అయితే, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పరంగా జరుగుతున్న కృషిని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా, దేవయానిపై అమెరికా కోర్టులో ఉన్న కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలన్న భారత్ డిమాండ్‌ను అమెరికా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కేసును వెనక్కు తీసుకునే ప్రసక్తేలేదని, జనవరి 13న ఆమెపై అభియోగాలను నమోదు చేయనున్నారని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. సంపూర్ణ దౌత్యరక్షణ లభించే ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్‌కు బదిలీ అయినప్పటికీ.. దేవయానిపై కేసు బలంగా ఉందని, దానిని ఉపసంహరించబోరని, కాకపోతే, వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా మినహాయిం పు ఇవ్వొచ్చని తెలిపాయి.
దౌత్యరక్షణ ఉన్నంతకాలం ఆమెపై ఉన్న కేసును సస్పెన్షన్‌లో ఉంచి, ఆ తరువాత విచారణ ప్రారంభించవచ్చని.. ఆ తరువాత ఎప్పుడు అమెరికాకు వచ్చినా ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని వివరించాయి. అయితే, ఈ వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్యంలో చాలామంది మాట్లాడుతుంటారని.. అయితే అమెరికా విదేశాంగ శాఖ నుంచి వచ్చే స్పందన మాత్రమే అధికారిక ప్రకటనలా భావిస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మంగళవారం పేర్కొన్నారు. దేవయాని అరెస్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తున్నామని అమెరికా నుంచి తమకు అధికారికంగా సమాచారం ఉందని తెలిపారు. భారతీయ దౌత్యాధికారిణిపై కేసును తీవ్రంగా తీసుకున్నామని స్పష్టం చేశారు. కాగా, తమ కాన్సులేట్లలో పనిచేస్తున్న భారతీయులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను అమెరికా ఖండించింది. ఒక్క భారత్‌లోనే కాదు తమ కాన్సులేట్లు ఉన్న అన్ని దేశాల్లోనూ స్థానిక చట్టాలు, నిబంధనల ప్రకారం వేతనాలు ఇస్తున్నామంది.