
కొరియా మళ్లీ కమాల్ కియా..
206 దేశాలు, 60 వేల దుస్తుల హ్యాంగర్లు, 1కోటి కుర్చీలు, 34 వేల మంచాలు, 10,500 మంది ఆటగాళ్లు, 42 ఈవెంట్లు, 17 రోజులు, 75 లక్షల టికెట్లు తడిసిమోపెడయ్యే ఖర్చు. ఇవీ.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న విశ్వక్రీడా సంగ్రామం రియో ఒలింపిక్ 2016 కోసం జరుగుతోన్న ఏర్పాట్లు. క్రీడలు ప్రారంభం కాకముందే ఒలింపిక్ అంశంలో తనదైన పత్యేకతను చాటుకుని వార్తల్లో నిలిచింది ఆసియా దేశం దక్షిణకొరియా. పోటీలు జరుగుతోన్న బ్రెజిల్.. ప్రపంచాన్ని గడగడలాడించిన జికా వైరస్ కు జన్మస్థానం కావడంతో తన ఆటగాళ్లకు ఆ వైరస్ సోకకుండా జికా ప్రూఫ్ యూనిఫామ్ లను సిద్ధం చేసింది దక్షిణకొరియా.
కాగా జికా వైరస్ తగ్గుముఖం పట్టిందని, దాదాపు అంతరింపజేశామని బ్రెజిల్ ఇదివరకు ప్రకటించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దానిని ఆమోదించడంతో ఒలింపిక్ క్రీడలకు విఘ్నాలు తొలిగిపోయాయి. అయినాసరే ఎందుకైనా మంచిదని జికా ఫ్రూఫ్ దుస్తులు తయారుచేశామని, దీనిని ధరిస్తే వైరస్ వ్యాప్తిచేసే దోమలు దరిచేరవని కొరియా చెబుతోంది. సియోల్ లో బుధవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కొరియర్ క్రీడాకారులు కొత్తగా రూపొందించిన జికా వైరస్ యూనిఫామ్ లను ప్రదర్శించారు. ముందుజాగ్రత్తగా దక్షిణ కొరియా చేపట్టిన ఈ దుస్తుల చర్యను తెలుసుకుని ఇతర దేశాల ఆటగాళ్లు అనుకుంటున్నారట.. 'కొరియా.. తూనే కమాల్ కియా'అని! దక్షిణ అమెరికా ఖండ దేశం బ్రెజిల్ లోని అతిపెద్ద తీర నగరం రియో డి జెనిరోలో ఆగస్ట్ 5 నుంచి 21 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి.