దేవుడు లేడన్నందుకు ఏడాది జైలు
'దేవుడు లేడు. బైబిల్ కథలన్నీ పుక్కిటి పురాణాలే' అని రష్యాకు చెందిన హేతువాది 38 ఏళ్ల విక్టర్ క్రష్ణోవ్ వ్యాఖ్యానించినందుకు ఆయనకు ఏడాది జైలుశిక్ష పడనుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటివి కూడా కావు. 2014లో యూరోపియన్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ 'వీకే డాట్ కామ్'లో చేసినవి. కేసవుతుందని తెలసి వెంటనే ఆ వ్యాఖ్యలను సైట్ నుంచి వెంటనే తొలగించారు కూడా.
2014లోనే కేసు దాఖలైనా, సోమవారం నుంచే విచారణ కొనసాగుతోంది. విక్టర్ తన వ్యాఖ్యలతో మత విశ్వాసకుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆయనపై కేసు దాఖలైంది. అప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను రష్యా ప్రభుత్వం పెద్దగా పట్టించుకునేది కాదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతరకర కథనాలపై కేసులు దాఖలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది కేసులు ఎదుర్కొంటున్నారు.
దేవుడు లేడన్న విషయం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పినా.. తనపై కేసు దాఖలు చేయడం ఏంటని విక్టర్ ప్రశ్నిస్తున్నారు. అయినా సోషల్ మీడియా తన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడం ఏంటని ఆయన అన్నారు. వాస్తవానికి సోషల్ మీడియా గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి కేసులు పెడుతోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. విక్టర్‌కు ఏడాది జైలుశిక్ష తప్పదని.. ఒకటి, రెండు రోజుల్లో తీర్పు వెలువడుతుందని న్యాయవర్గాలు తెలియజేస్తున్నాయి.