
ట్రంప్‌పై రష్యా మీడియా ఫైర్
రాజకీయాల్లో ఎప్పుడు మిత్రులవుతారో.. ఎప్పుడు శత్రువులుగా మారుతారో చెప్పడం కష్టం.
మాస్కో: రాజకీయాల్లో ఎప్పుడు మిత్రులవుతారో.. ఎప్పుడు శత్రువులుగా మారుతారో చెప్పడం కష్టం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి ఇది రుజువైనట్లు అనిపిస్తోంది. నిన్నటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్నేహ హస్తం అందించిన రష్యా.. తాజాగా శత్రు వైఖరి ప్రదర్శిస్తోంది. ట్రంప్ ఓ గ్రేట్ లీడర్ అని చెప్పిన రష్యానే.. ఇప్పుడాయన ప్రమాదకరమని చెబుతోంది. ట్రంప్‌పై రష్యా అధికారిక టీవీ ఛానల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కంటే ట్రంపే ప్రమాదకర నాయకుడని ఓ టీవీ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. రష్యాలోని మిగతా టీవీ చానల్స్ కూడా ట్రంప్‌పై ఇలాంటి ఆరోపణలే చేశాయి. దీంతో ట్రంప్, రష్యా మధ్య సంబంధాలు బలహీనపడేలా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌కు రష్యా మద్దతు పలికింది. కానీ, సిరియాపై అమెరికా దాడి నుంచి ఇరుదేశాల మధ్య దూరం పెరుగుతోంది.