బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు! | Satellite Images Suggest Chinese Activity In Indian Territory Before Face Off | Sakshi
Sakshi News home page

బయటపడ్డ చైనా కుట్ర.. అందుకే ఘర్షణ!

Published Fri, Jun 19 2020 4:22 PM | Last Updated on Fri, Jun 19 2020 6:01 PM

Satellite Images Suggest Chinese Activity In Indian Territory Before Face Off - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఘాతుకానికి తెగబడిన చైనా కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గాల్వన్‌ లోయపై పట్టు సాధించేందుకు.. గాల్వన్‌ నదిపై డ్రాగన్‌ డ్యామ్‌ నిర్మిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాయిటర్స్‌ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఎర్త్‌- ఇమేజింగ్‌ కంపెనీ ప్లానెట్‌ ల్యాబ్స్‌ చిత్రీకరించిన ఫొటోలను షేర్‌ చేసిన రాయిటర్స్‌.. గాల్వన్‌ లోయలో జూన్‌ 9, 16 తేదీల్లో చోటుచేసుకున్న పరిణామాలను విశ్లేషించింది. ఈ ఫొటోలను నిశితంగా పరిశీలించినట్లయితే.. హిమాలయ పర్వత ప్రాంతంలో కాలిబాట ఏర్పరిచిన డ్రాగన్‌ ఆర్మీ... దాని గుండా డ్యామ్‌ నిర్మాణ సామాగ్రిని తరలించినట్లు కనిపిస్తోంది. భారత భూభాగాన్ని ఆక్రమించే క్రమంలో వారం రోజులుగా దూకుడు పెంచిన చైనా ఆర్మీకి అడ్డుకట్ట వేసేందుకు భారత జవాన్లు ప్రయత్నించగా వారిని దొంగ దెబ్బ కొట్టినట్లు స్పష్టమవుతోంది.(ఫార్వార్డ్‌ బేస్‌లకు యుద్ధ విమానాలు)  

ఈ విషయం గురించి కాలిఫోర్నియా మిడిల్‌బరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌- ఈస్ట్‌ ఏషియా నాన్‌ప్రొలిఫెరేషన్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ జెఫ్రీ లూయిస్‌ మాట్లాడుతూ.. ప్లానెట్‌ ల్యాబ్స్‌ ఫొటోలు చూసినట్లయితే.. గాల్వన్‌ లోయ వెంబడి రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటుగా చైనా డ్యామ్‌ నిర్మిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. అదే విధంగా వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఆర్మీకి చెందిన 30-40 వాహనాలు ఉంటే.. చైనా వందకు మించి వాహనాలను అక్కడ నిలిపినట్లు స్పష్టమవుతోందన్నారు. సరిహద్దులు మార్చేందుకే డ్రాగన్‌ ఈ చర్యలకు పూనుకుందా అని అనుమానం వ్యక్తం చేశారు. కాగా భారత్‌ చైనాతో 4,056 కిలోమీటర్ల సరిహద్దు(సినో- ఇండియన్‌ బార్డర్‌) కలిగి ఉన్న విషయం తెలిసిందే. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!)

డ్యామ్‌ నిర్మాణం పూర్తయిందా?
ఈ నేపథ్యంలో భారత భూభాగం దురాక్రమణకు గురికాకుండా నిరంతరం సైనికులు అక్కడ పహారా కాస్తారు. హిమనీనదాలు, మంచు ఎడారులు, నదులు, దట్టమైన అడవులు ఎటువంటి ప్రదేశాల్లోనైనా సరే ప్రాణాలకు తెగించి శత్రువులకు ఎదురునిలబడతారు. ఇక అక్సాయ్‌ చిన్‌పై ఆధిపత్యం ప్రదర్శించేందుకు యత్నిస్తున్న చైనా.. దానికంటే ముందుగా గాల్వన్‌ లోయపై పట్టు సాధించేందుకు కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగానే రోడ్డు, డ్యామ్‌ నిర్మాణాలు చేపడుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య ఈ ఏడాది మేలో హింసాత్మక ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చర్చలతో సమస్యలకు పరిష్కారం కనుగొనమంటామని ఇరు దేశాలు ప్రకటించాయి.

ఈ క్రమంలో దౌత్య, మిలిటరీ స్థాయి చర్చల తర్వాత ఏకాభిప్రాయం కుదిరినట్లు వెల్లడించాయి. అయితే.. ఓ వైపు చర్చలు సాగిస్తూనే జిత్తుల మారి చైనా.. తన కుట్రలను అమలు చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భారత సైనికులతో ఘర్షణకు దిగింది. జూన్‌ 16 నాటి ఫొటోలు చూస్తుంటే ఓ వైపు భారత ఆర్మీని దొంగ దెబ్బ కొడుతూనే.. మరోవైపు డ్యామ్‌ నిర్మాణం పూర్తి చేసి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా డ్రాగన్‌ కుట్రను భగ్నం చేసే క్రమంలో సోమవారం రాత్రి కల్నల్‌ సంతోష్‌ బాబు సహా పలువురు జవాన్లు వీరమరణం పొందిన విషయం విదితమే. ఇనుప రాడ్లతో భారత ఆర్మీపై చైనా సైనికులు దాడికి తెగబడినట్లుగా ఆనవాళ్లు బయటపడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement