రియాద్: సౌదీ అరేబియాలో యువరాజులు, మంత్రులతో పాటు పలువురు కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఇందులో ఒక బిలియనీర్ కూడా ఉన్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు జరిగినట్టుగా తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి అరెస్ట్ అయిన 11 మంది యువరాజుల్లో ప్రముఖ బిలియనీర్ అల్–వలీద్ బిన్ తలాల్ ఉన్నారు. రాయల్ డిక్రీ ద్వారా క్రౌన్ ప్రిన్స్ మహమూద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో అవినీతి వ్యతిరేక కమిషన్ ఏర్పాటైన కొద్దిసేపటికే ఈ అరెస్టులు జరిగాయి. సౌదీ నేషనల్ గార్డ్ అధిపతి, నేవీ చీఫ్, ఆర్థిక మంత్రిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించడం సంచలనం సృష్టించింది. సౌదీలో చమురు శకం తర్వాత ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రిన్స్ సల్మాన్ తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా 11 మంది యువరాజులను, నలుగురు ప్రస్తుత మంత్రులను, డజనుకుపైగా మాజీ మంత్రులను అరెస్టు చేసినట్లు సౌదీ అధికారిక మీడియా వెల్లడించింది. 2009 నాటి పాత కేసులకు సంబంధించి ఈ అరెస్టులు జరిగినట్టు తెలిపింది. అవినీతి వ్యతిరేక కమిషన్ లక్ష్యం ప్రజా ధనాన్ని కాపాడటం.. అవినీతికి పాల్పడే వారిని.. అధికారాన్ని దుర్వినియోగం చేసే వారిని శిక్షించడం.. అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment