సౌదీ వారసుడు మారాడు
క్రౌన్ ప్రిన్స్‌గా బిన్ సల్మాన్
రియాద్: సౌదీ అరేబియా రాచరిక వారసత్వ పరంపరలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. రాజు సల్మాన్ తన కొడుకు, డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ అయిన మహ్మద్ బిన్ సల్మాన్(31)ను యువరాజు(క్రౌన్ ప్రిన్స్)గా నియమించారు. దీంతో తన తరువాత సింహాసనాన్ని చేపట్టే అవకాశాన్ని కొడుకుకు కల్పించినట్లయింది. ఇప్పటిదాకా యువరాజు స్థానంలో ఉన్న సోదరుడి కుమారుడు మహ్మద్ బిన్ నయేఫ్(51)ను తప్పించడంతో పాటు ఆయన్ని డిప్యూటీ ప్రధాని, అంతర్గత భద్రత మంత్రిగా కూడా తొలగించారు. యువరాజుగా ఎంపికైన మహ్మద్ బిన్ సల్మాన్ ఇప్పటికే రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక మండలి అధిపతిగా వ్యవహరిస్తున్నారు.
బిన్ సల్మాన్ పదవీచ్యుతుడైన సోదరుడు నయేఫ్ చేతిని ముద్దాడుతూ ఆయన ముందు మోకారిల్లడం టీవీ చానెళ్లలో కనిపించింది. బదులుగా నయేఫ్, యువరాజు భుజం తడుతూ శుభాకాంక్షలు చెప్పారు. ఇక తాను విశ్రాంతి తీసుకుంటానని నయేఫ్ అన్నారు. దీనికి బిన్ సల్మాన్ స్పందిస్తూ... ఆయన సలహాల్లేకుండా తానేం చేయలేనన్నారు. కాగా, బిన్ సల్మాన్ అమెరికాలో పర్యటించడం ట్రంప్ సౌదీలో తన తొలి విదేశీ పర్యటన జరపడానికి మార్గం సుగమం చేసిందని భావిస్తున్నారు.