రియాద్: హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియా–ఖతార్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ముందడుగు పడింది. హజ్ యాత్రికుల కోసం ఖతార్ సరిహద్దును తిరిగి తెరవాలని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రియాద్‌వాసులు హజ్ యాత్రకు రావడానికి మార్గం సుగమమైంది.
ఖతార్ రాజ కుటుంబ సభ్యుడైన షేక్ అబ్దుల్లా అల్ తానీతో జెడ్డాలో ప్రత్యేకంగా సమావేశమైన సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక జెట్ విమానాలను సౌదీలోని జెడ్డా నుంచి ఖతార్ రాజధాని దోహాకు పంపించనున్నట్లు సౌదీ మీడియా తెలిపింది. దీనికయ్యే ఖర్చంతా సౌదీ రాజు భరిస్తారంది. ఉగ్రవాదానికి మద్దతిస్తోందంటూ సౌదీ, ఈజిప్టు, బహ్రెయి న్, యూఏఈ.. ఖతార్‌తో దౌత్య సంబంధాలను తెంచుకున్న సంగతి తెలిసిందే.