'కన్య'గా ఉంటేనే స్కాలర్‌షిప్ ఇస్తారట!
పద్దెనిమిదేళ్ల థుబెలిల్.. దక్షిణాఫ్రికా క్వాజులూ నాటల్ ప్రావిన్స్‌లో ఓ మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థిని. త్వరలోనే ప్రిటోరియా వెళ్లి అక్కడి యూనివర్సిటీలో చదువాలనుకుంటోంది. కానీ, థుబె (ఆమె స్నేహితులు ఇలాగే పిలుస్తారు) కుటుంబం నిరుపేదది. ఆమె కాలేజీ చదువులకు ఫీజులు చెల్లించే స్థోమత ఆమె కుటుంబానికి లేదు. చదువుకోవడానికి ఆమెకు ఉన్న ఏకైక మార్గం స్థానిక ఉథుకెలా మున్సిపాలిటీ అందించే ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు. క్వాజులు నాటల్ ప్రావిన్స్ లోని 11 జిల్లాల్లో విద్యార్థినులకు ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్ అందిస్తోంది. అయితే, ఈ స్కాలర్‌షిప్ పొందడానికి విద్యార్థినుల ఏకైక అర్హత 'కన్యలు'గా (వర్జిన్స్) ఉండటం. 'అందుకే మేం అబ్బాయిలకు దూరంగా ఉంటున్నాం. మా లక్ష్యాలను సాధించాలనుకుంటున్నాం' అంటోంది థుబె. 'నాకు ఇప్పుడు 18 ఏళ్లు. పిల్లలు లేరు. ఈ ప్రపంచాన్ని గెలువాలంటే నేను తప్పకుండా కష్టపడి చదువాలి' అని చెప్తోంది ఆ యువతి.
'మెయిడెన్ బర్సరీ అవార్డ్' పేరిట ఇచ్చే ఈ స్కాలర్‌షిప్ కోసం ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో థుబె కన్యత్వ పరీక్షలకు హాజరవుతుంది. వాళ్ల కమ్యూనిటీలో ఓ మహిళా పెద్ద ఓ గడ్డి పరుపుపై పడుకోబెట్టి.. 'మానవ పరీక్ష' ద్వారా తను కన్యనా కాదా? అన్నది నిర్ధారిస్తుంది. ఈ ఉపకార వేతనం పొందడానికి కన్యగా ఉండటం తప్ప మరో మార్గమేది లేదని చెప్తోంది థుబె.
ఈ పరీక్షలు దారుణం.. మానవత్వానికి మచ్చ!
కన్యత్వ ఆధార స్కాలర్‌షిప్ విధానంపై దక్షిణాఫ్రికాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. హక్కుల సంఘాలు ఈ విధానాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. ఈ పరీక్షలు దారుణమని, మానవత్వానికి వ్యతిరేకమని మండిపడుతున్నాయి. ఈ స్కాలర్‌షిప్‌లు అనాది మూఢనమ్మకాలను కొనసాగించేవిధంగా ఉన్నాయి. కన్యత్వం ఆధారంగా కాకుండా ప్రతిభా, సామర్థ్యాల ఆధారంగా స్కాలర్‌షిప్ ఇవ్వాలి' అని లింగ సమానత్వ కమిషన్ చీఫ్ జువు బలోయి డిమాండ్ చేశారు. దక్షిణాఫ్రికా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఈ విధానంపై దేశ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్కాలర్‌షిప్ పథకం వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్న ఉథుకెలా మేయర్ దుబు మజిబుకో మాత్రం ఈ విధానాన్ని నిర్ద్వంద్వంగా సమర్థించుకుంటున్నారు.
'విమర్శకులు సమస్యలపై విమర్శలు మాత్రమే చేస్తున్నారు. కానీ పరిష్కారాలు ఆలోచించడం లేదు. నేను టీనేజర్‌గా ఉన్నప్పుడే గర్భవతిని అయ్యాను. అప్పుడు నేను అనుభవించిన వేదన ఇప్పుడు బాలికలు అనుభవించకూడదని నేను భావిస్తున్నాను' అని ఆమె చెప్తున్నారు. 2012 గణాంకాల ప్రకారం క్వాజులు-నాటల్ ప్రావిన్స్ లో టీనేజ్ వయసులోనే గర్భవతులైన బాలికలు పెద్ద మొత్తంలో ఉన్నారు. 2012లో 15-19 ఏళ్ల మధ్య వయస్సున యువతులకు 26వేల మంది పిల్లలు పుట్టారు. ఉథుకెలా జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధి కూడా ప్రబలంగా ఉంది. ఈ నేపథ్యంలో బాలికలు లైంగిక దుశ్చర్యల బారినపడే అవకాశముందని, దీనిని నిరోధించేందుకే తాము ఈ పథకాన్ని తెచ్చామని మేయర్ మజిబుకో వివరణ ఇస్తున్నారు.
'బాలికలు చాలా దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్నారు. పెద్ద వయసు వ్యక్తితో శృంగారాన్ని వారు నిరాకరించే పరిస్థితి లేదు. ఆ వ్యక్తిని కండోమ్ ధరించమని చెప్పే పరిస్థితిలో కూడా వాళ్లు ఉండరు. బాలికలు లైంగిక దశకు రాకముందే ఇది జరుగుతోంది' అని ఆమె చెప్పారు.