ఆస్ట్రేలియా నూతన ప్రధాని స్కాట్ మోరిసన్
మెల్‌బోర్న్: లిబరల్ పార్టీకి చెందిన స్కాట్ మోరిసన్ (50) ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా శుక్రవారం ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌కు వ్యతిరేకంగా రాజకీయ తిరుగుబాటు రావడంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. మాజీ హోం మంత్రి పీటర్ డ్యుటన్‌పై రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్న మోరిసన్ 45–40 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆస్ట్రేలియా ప్రధానిగా మోరిసన్‌తో గవర్నర్ జనరల్ కాస్‌గ్రోవ్ ప్రమాణం చేయించారు. తనను ప్రధాని పదవి నుంచి దించేందుకు చాలా కాలం నుంచి కుట్రలు జరుగుతూ వచ్చాయని పదవీచ్యుత ప్రధాని టర్న్‌బుల్ అన్నారు. ప్రధాని పదవి నుంచి తప్పుకొని కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా లిబరల్ పార్టీ చట్టసభ సభ్యులు డిమాండ్ చేయడంతో టర్న్‌బుల్ పదవి నుంచి తప్పుకొన్నారు.
ఆ బిల్లుతో బయటపడ్డ విభేదాలు..
విద్యుత్ బిల్లుల తగ్గింపు, ఉద్గారాల తగ్గింపు ప్రతిపాదనల్ని ప్రధాని టర్న్‌బుల్ ప్రకటించడంతో పార్టీలోని విభేదాలు గతవారం ఒక్కసారిగా బయటపడ్డాయి. టర్న్‌బుల్ 2015లో అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు 2019 మేలో జరగాల్సి ఉండగా ప్రభుత్వంలో ఆయనపై వ్యతిరేకత కారణంగా టర్న్‌బుల్ తప్పుకున్నారు. ఆస్ట్రేలియాలో పదేళ్లలో ఆరుగురు ప్రధాన మంత్రులు మారడం విశేషం. గత దశాబ్ద కాలంలో ఆస్ట్రేలియా రాజకీయాల్లో ప్రత్యర్థుల తిరుబాట్లతో ప్రధానమంత్రులు మారుతూ వస్తున్నారు. ఏ ప్రధాని కూడా వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment