
గోల్డెన్ లయన్ టమరిన్.. సిల్వర్ మెర్కోసెట్
కవితకు కాదేదీ అనర్హం అన్నట్లు...ఏకంగా కోతుల్ని కూడా దొంగలు వదిలిపెట్టలేదు. సీసీ టీవీ కెమెరాలు, సాయుధ గార్డుల కళ్లుగప్పి చాకచక్యంగా జూలోకి ప్రవేశించిన దొంగలు...
కవితకు కాదేదీ అనర్హం అన్నట్లు...ఏకంగా కోతుల్ని కూడా దొంగలు వదిలిపెట్టలేదు. సీసీ టీవీ కెమెరాలు, సాయుధ గార్డుల కళ్లుగప్పి చాకచక్యంగా జూలోకి ప్రవేశించిన దొంగలు... 17 కోతులను అహరించుకు వెళ్లిన ఘటన ఫ్రాన్స్లో సంచలనం సృష్టిస్తోంది. సెంట్రల్ ఫ్రాన్స్లోని సెయింట్ ఆగ్నన్ జూలాజికల్ పార్కు నుంచి గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి అరుదైన జాతులకు చెందిన 17 కోతుల్ని మాయం చేశారని జూ పార్కు డైరెక్టర్ రుడాల్ఫ్ డెలార్డ్ మీడియాకు చెప్పారు. దొంగలు ఎత్తుకెళ్లినవాటిలో ఏడు గోల్డెన్ లయన్ టమరిన్స్ కాగా, పది సిల్వర్ మెర్కోసెట్స్. ఈ రెండు జాతులూ అంతరించి పోతున్న జీవుల జాబితాలో ఉన్నవే కావడం గమనార్హం.
ప్రత్యేక ఏర్పాట్లతో వాటిని సంరక్షిస్తూ వస్తున్న పార్క్ నిర్వాహకులు కోతుల దొంగతనంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రొఫెషనల్స్ తరహాలో సీసీ టీవీ కెమెరాలకు చిక్కడమేకాదు.. ఎలాంటి ఆధారాలూ వదిలేయకుండా దొంగలు కోతుల్ని ఎత్తుకెళ్లారు. 'అసలే అవి సున్నితమైన కోతులు. వాటిలో ఒకదాని తోకకు గాయమైతే పశువైద్యులతో ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నాం. దొంగలు వాటికి హానితలపెడతారేమోనని ఆందోళనగా ఉంది. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చాం. వాళ్లు దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు' అని రుడాల్ఫ్ పేర్కొన్నారు.