
నైట్ క్లబ్‌లో పేలుడు, 27 మంది మృతి
రొమేనియాలోని బుకారెస్ట్‌లో గల ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి 27 మంది మరణించారు, 180 మందికి పైగా గాయపడ్డారు. టపాసులతో కూడిన రాక్ సంగీత కచేరీ నిర్వహించిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు రొమేనియా ప్రభుత్వాధికారులు తెలిపారు. మంటలు చెలరేగడంతో పాటు బాగా పొగ అలముకోవడంతో క్లబ్‌లో ఉన్న 400 మంది ఒకేసారి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి విపరీతమైన తొక్కిసలాట కూడా జరిగింది. క్లబ్ లోపల టపాసులు కాల్చేందుకు ప్రయత్నించడం వల్లే ఈ దారుణం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మంటల్లో క్లబ్ సీలింగ్‌తో పాటు ఒక పిల్లర్ కూడా కాలిపోయింది. తర్వాత భారీ పేలుడు సంభవించి లోపలంతా పొగ అలముకుందని తెలిపారు. బయట ఫుట్‌పాత్ మీద పడి ఉన్న అనేకమందికి కృత్రిమంగా ప్రాణవాయువు అందించేందుకు పారామెడికల్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ప్రయత్నించారు. ఆ పరిసరాల్లో ఎక్కడ చూసినా అంబులెన్సుల సైరన్ల మోతే వినిపించింది. తొక్కిసలాట వల్లే బాగా ఇబ్బంది పడ్డామని కాళ్లకు బూట్లు కూడా లేకుండా బయటకు వచ్చిన ఓ వ్యక్తి చెప్పాడు. ఐదు సెకండ్లలోనే మొత్తం సీలింగ్‌కు మంటలు అంటుకున్నాయని, ఒకే డోర్ ఉండటంతో దానిగుండానే అందరం బయటపడాల్సి వచ్చిందని మరో యువతి చెప్పింది. బుకారెస్ట్‌లో ఉన్న పది ఆస్పత్రులలో బాధితులను చేర్చినట్లు హోంశాఖ డిప్యూటీ మంత్రి రయీద్ అరాఫత్ చెప్పారు.