షేక్‌స్పియర్ మహిళనా?
లండన్: హ్యామ్లెట్, ఒథెల్లో, మ్యాక్‌బెత్ లాంటి విషాధభరిత నాటకాలతోపాటు హాస్య, శృంగార నాటకాలతో, సమకాలీన కవిత్వంతో అశేష అభిమానులను కూడగట్టుకున్న ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్ల రచయిత విలియమ్ షేక్‌స్పియర్ మగవాడు కాదా? మహిళనా? అవును. ఆయన ఆయన కాదు. ఆమె అంటూ షేక్‌స్పియర్ సాహిత్యం, జీవితంపై ఎన్నో పరిశోధనలు సాగించిన జాన్ హడ్సన్ తెలియజేస్తున్నారు.
షేక్‌స్పియర్ అసలు పేరు అమేలియా బస్సానో అని, ఆమె నల్లటి కురులు కలిగిన యూదు జాతి మహిళని, అమె వంశస్థులు క్వీన్ ఎలిజబెత్-1 కాలంలో సంగీత విద్వాంసులుగా పనిచేశారని జాన్ హడ్సన్ ‘షేక్‌స్పియర్స్ డార్క్ లేడీ’ పేరుతో రాసిన తాజా పుస్తకంలో వెల్లడించారు. ఆమె లార్డ్ చాంబెర్లేన్ హెన్రీ కేరీని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. నాటి ఇంగ్లీష్ థియేటర్‌కు హెన్రీ కేరి ఇంచార్జిగా పనిచేశారని, అందుకనే ఆమె నాటకాలను అనేకం ఆ థియేటర్‌లో ప్రదర్శించారని చెప్పారు.
షేక్‌స్పియర్ నాటకాల్లో ప్రతిబింబించే ఇటలీ సంస్కృతి గురించి ఇంగ్లండ్‌లో పుట్టిపెరిగి ఇక్కడే అసువులు బాసిన బస్సానోకు ఎలా తెలుసుననే అనుమానానికి జాన్ హడ్సన్ వివరణ ఇస్తూ అమేలి కుటుంబం ఇటలీ నుంచి వలస వచ్చిందని, అందుకనే ఆమెకు ఇటలీ సంస్కృతి గురించి తెలుసని చెప్పారు. ఒథెల్లో నాటకంలో ఎమెలీ అనే, మర్చంట్ ఆఫ్ వెనీస్‌లో బస్సానో అనే క్యారెక్టర్లు ఆమె పేరును ప్రతిబింబిస్తున్నాయని కూడా హడ్సన్ తెలిపారు. క్రిస్టఫర్ మార్లో అనే ప్రసిద్ధ నాటక రచయితతో బస్సానోకు ఎఫైర్ కొనసాగించారని, ఆమె 1645లో చనిపోవడానికి ముందు గర్భవతి అని కూడా హడ్సన్ పేర్కొన్నారు.
దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం మరణించిన షేక్‌స్పియర్ ఎవరనే విషయంలో ఇప్పటికే ఎన్నో థియరీలు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవాలను తెలుసుకునేందుకు స్టార్ట్‌ఫోర్డ్‌లోని ట్రినిటీ చర్చిలోవున్న షేక్‌స్పియర్ సమాధిపై కూడా చాలా పరిశోధనలు జరిగాయి. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ద్వారా పురావస్తు తత్వవేత్తలు పరిశోధించగా 1794లోనే ఆయన పుర్రె మాయం అయిందనే విషయం వెలుగుచూసింది. వాస్తవాస్తవాలు తేలాలంటే మరెన్నేళ్లు పరిశోధనలు జరగాలో!