శ్రీలంకలోనూ శివసేన!
శివసేన అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది బాల ఠాక్రే.. మహారాష్ట్ర. మరాఠా ఫీలింగును ప్రజల్లో గట్టిగా రగిలించి అధికారాన్ని కూడా చేజిక్కించుకుని ఒకానొక సమయంలో ముంబై మహానగరాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన వ్యక్తి బాల ఠాక్రే. ఆయన స్థాపించిన శివసేన.. ఇప్పుడు నెమ్మదిగా శ్రీలంకకు కూడా విస్తరించింది. అక్కడ పేరును కొద్దిగా మార్చుకుని శివసేనై అని పెట్టుకుంది. దాంతో ఒక్కసారిగా శ్రీలంక నాయకుల వెన్నులో వణుకు పుడుతోంది. 2009 వరకు అంతర్యుద్ధంతో అల్లాడిన ఈ ద్వీపంలో మళ్లీ ఏమైనా కలకలం రేగుతుందా అన్న భయం మొదలైంది.
ఉత్తర శ్రీలంకలో తమిళులు ఎక్కువగా ఉండే వవునియా ప్రాంతంలో శివసేనై ప్రారంభమైంది. దానికి మరవన్పులవు సచ్చిదానందన్ నేతృత్వం వహిస్తున్నారు. హిందూ, బౌద్ధ మతాల నుంచి సింహళీల మతంలోకి విపరీతంగా పెరుగుతున్న మతమార్పిడులను అడ్డుకోడానికి, వాటిపై పోరాడేందుకు ఈ సంస్థను ప్రారంభించారు. దీనికి శివసేన కూడా మద్దతు పలికింది. ఈ విషయాన్ని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ధ్రువీకరించారు. తమది హిందూ పార్టీ అని, అందువల్ల ప్రపంచంలో హిందువుల కోసం పోరాడేవాళ్లు ఎవరున్నా మద్దతు పలుకుతామని ఆయన అన్నారు.
కొత్తగా ఏర్పడిన శివసేనై కూడా మిలిటెంట్ లక్షణాలు కలిగి ఉండటంతో సింహళ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తమిళుల ఐక్యత దెబ్బతిని, తమలో చీలికలు వస్తాయేమోనని తమిళ నాయకులు భయపడుతున్నారు. శ్రీలంక రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ముగ్గురు నాయకులు.. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘెలకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ, యునైటెడ్ నేషనల్ పార్టీలతో పాటు మరో ప్రధానమైన ప్రతిపక్షం తమిళ నేషనల్ అలయెన్స్ కూడా శివసేనై పార్టీ పుట్టుకపై ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకలో హిందూభావాలతో ఏర్పడిన మొట్టమొదటి పార్టీ.. శివసేనై. ప్రభుత్వం సింహళ బౌద్ధులను ప్రోత్సహిస్తూ.. హిందువుల ప్రాధాన్యాన్ని తగ్గిస్తోందని ఈ పార్టీ ఆరోపిస్తోంది. ముస్లింలు, క్రిస్టియన్లకు తమ మత వ్యాప్తి కోసం భారీ మొత్తంలో నిధులు వస్తున్నాయని కూడా అంటున్నారు. హిందువులకు శ్రీలంకలో మద్దతు లేదని, వాళ్ల హక్కుల కోసం తమలాంటి భావాలున్న భారతీయ సంస్థలతో కలిసి పోరాడుతామని సచ్చిదానందన్ చెప్పారు. అయితే, శివసేనైతో పాటు దానిలాంటి సంస్థల వల్ల శాంతిభద్రతలకు ముప్పు కలుగుతుందని సంయుక్త ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ దినేష్ గుణవర్ధనే ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశం అతిపెద్ద రక్తపాతం నుంచి ఈమధ్యే బయటపడిందని, ఇలాంటి సంస్థలు తమకు అక్కర్లేదని అన్నారు. భారతదేశంలో శివసేన ఏం చేస్తోందో తమకు తెలుసని ఆయన అన్నారు. మొత్తమ్మీద శివసేన శ్రీలంకలో కూడా ప్రకంపనలు పుట్టిస్తోంది.