sri lanka politics
-
గొటబాయకు ఎయిర్పోర్టులో అవమానం.. అరెస్టుకు భయపడి చివరికి...
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆంటోనోవ్ 32 అనే సైనిక విమానంలో బుధవారం వేకువ జామున ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. గొటబాయతో పాటు ఆయన సతీమణి, బాడీగార్డులు కలిపి మొత్తం నలుగురు ఈ విమానంలో దేశం దాటారు. గొటబాయ కుటుంబం మాల్దీవులకు వెళ్లిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. వారి పాసుపోర్టులపై స్టాంపులు వేసినట్లు పేర్కొన్నారు. తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జులై 13న రాజీనామా చేస్తానని ప్రకటించారు గొటబాయ. సరిగ్గా అదే రోజు దేశం విడిచి పారిపోయారు. అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు గొటబాయను అరెస్టు చేయడానికి వీల్లేదు. రాజీనామా చేసిన తర్వాత తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే అంతకంటే ముందే ఆయన దేశం వీడి పారిపోయినట్లు తెలుస్తోంది. తన కుటుంబాన్ని వెళ్లినిస్తేనే రాజీనామా చేస్తానని గొటబాయ అధికారులకు చెప్పినట్లు సమాచారం. 24 గంటలు గొడవ గొటబాయ సోమవారమే వాణిజ్య విమానంలో దుబాయ్ పారిపోవాలని ప్రయత్నించారు. అయితే ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది అతన్ని వీఐపీ టర్మినల్ ద్వారా వెళ్లనిచ్చేందుకు నిరాకరించారు. సాధారణ ప్రజల్లా పబ్లిక్ కౌంటర్ నుంచే రావాలని సూచించారు. జనం తమను చూస్తే ఎక్కడ దాడి చేస్తారో అనే భయంతో ఆయన పబ్లిక్ కౌంటర్ వైపు వెళ్లలేదు. 24 గంటలు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో అవమానంతోనే వెనుదిరిగారు. చివరకు సైనిక విమానంలో బుధవారం వేకువజామున దేశం వీడారు. చదవండి: కళ్లుగప్పి పారిపోవాలనుకున్న శ్రీలంక మాజీ మంత్రి.. ఎయిర్పోర్టు సిబ్బంది గుర్తుపట్టడంతో.. -
విజయం దిశగా మహింద రాజపక్స
కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అయిన మహింద రాజపక్స మరోసారి కీలకంగా మారనున్నారు. ఆయన నేతృత్వం వహిస్తున్న శ్రీలంక పొదుజన పెరుమణ(ఎస్ఎల్పీపీ) పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఫలితాలు వెలువడిన 16 సీట్లకుగాను 13 చోట్ల 60 శాతం పైగా ఓట్లు సాధించింది. తమిళులు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఉత్తర ప్రాంతంలో కూడా ఎస్ఎల్పీపీ అభ్యర్థులే విజయం దిశగా సాగిపోతున్నారు. మొత్తం 22 జిల్లాలకుగాను 17 జిల్లాల్లో ఎస్ఎల్పీపీ తిరుగులేని ఆధిక్యం సంపాదించినట్లు అనధికార ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 225 సీట్లున్న అసెంబ్లీలో ఎస్ఎల్పీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ గెలుపు అధికార పార్టీ సాధించిన అద్భుత విజయమని మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స పేర్కొన్నారు. ఈ గెలుపుపై మహింద రాజపక్సకు భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్–19 భయం పొంచి ఉన్నప్పటికీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారనీ, ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని అభినందించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకునేందుకు, ప్రత్యేకమైన అనుబంధాన్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఈ ఫలితాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. భారత ప్రధానికి మహింద రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంక, భారత్లు స్నేహితులు, బంధువులు కూడా అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
శ్రీలంకలోనూ శివసేన!
శివసేన అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది బాల ఠాక్రే.. మహారాష్ట్ర. మరాఠా ఫీలింగును ప్రజల్లో గట్టిగా రగిలించి అధికారాన్ని కూడా చేజిక్కించుకుని ఒకానొక సమయంలో ముంబై మహానగరాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన వ్యక్తి బాల ఠాక్రే. ఆయన స్థాపించిన శివసేన.. ఇప్పుడు నెమ్మదిగా శ్రీలంకకు కూడా విస్తరించింది. అక్కడ పేరును కొద్దిగా మార్చుకుని శివసేనై అని పెట్టుకుంది. దాంతో ఒక్కసారిగా శ్రీలంక నాయకుల వెన్నులో వణుకు పుడుతోంది. 2009 వరకు అంతర్యుద్ధంతో అల్లాడిన ఈ ద్వీపంలో మళ్లీ ఏమైనా కలకలం రేగుతుందా అన్న భయం మొదలైంది. ఉత్తర శ్రీలంకలో తమిళులు ఎక్కువగా ఉండే వవునియా ప్రాంతంలో శివసేనై ప్రారంభమైంది. దానికి మరవన్పులవు సచ్చిదానందన్ నేతృత్వం వహిస్తున్నారు. హిందూ, బౌద్ధ మతాల నుంచి సింహళీల మతంలోకి విపరీతంగా పెరుగుతున్న మతమార్పిడులను అడ్డుకోడానికి, వాటిపై పోరాడేందుకు ఈ సంస్థను ప్రారంభించారు. దీనికి శివసేన కూడా మద్దతు పలికింది. ఈ విషయాన్ని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ధ్రువీకరించారు. తమది హిందూ పార్టీ అని, అందువల్ల ప్రపంచంలో హిందువుల కోసం పోరాడేవాళ్లు ఎవరున్నా మద్దతు పలుకుతామని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడిన శివసేనై కూడా మిలిటెంట్ లక్షణాలు కలిగి ఉండటంతో సింహళ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తమిళుల ఐక్యత దెబ్బతిని, తమలో చీలికలు వస్తాయేమోనని తమిళ నాయకులు భయపడుతున్నారు. శ్రీలంక రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ముగ్గురు నాయకులు.. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘెలకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ, యునైటెడ్ నేషనల్ పార్టీలతో పాటు మరో ప్రధానమైన ప్రతిపక్షం తమిళ నేషనల్ అలయెన్స్ కూడా శివసేనై పార్టీ పుట్టుకపై ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకలో హిందూభావాలతో ఏర్పడిన మొట్టమొదటి పార్టీ.. శివసేనై. ప్రభుత్వం సింహళ బౌద్ధులను ప్రోత్సహిస్తూ.. హిందువుల ప్రాధాన్యాన్ని తగ్గిస్తోందని ఈ పార్టీ ఆరోపిస్తోంది. ముస్లింలు, క్రిస్టియన్లకు తమ మత వ్యాప్తి కోసం భారీ మొత్తంలో నిధులు వస్తున్నాయని కూడా అంటున్నారు. హిందువులకు శ్రీలంకలో మద్దతు లేదని, వాళ్ల హక్కుల కోసం తమలాంటి భావాలున్న భారతీయ సంస్థలతో కలిసి పోరాడుతామని సచ్చిదానందన్ చెప్పారు. అయితే, శివసేనైతో పాటు దానిలాంటి సంస్థల వల్ల శాంతిభద్రతలకు ముప్పు కలుగుతుందని సంయుక్త ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ దినేష్ గుణవర్ధనే ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశం అతిపెద్ద రక్తపాతం నుంచి ఈమధ్యే బయటపడిందని, ఇలాంటి సంస్థలు తమకు అక్కర్లేదని అన్నారు. భారతదేశంలో శివసేన ఏం చేస్తోందో తమకు తెలుసని ఆయన అన్నారు. మొత్తమ్మీద శివసేన శ్రీలంకలో కూడా ప్రకంపనలు పుట్టిస్తోంది.