అమెరికా కంపెనీలో ఉద్యోగులపై కాల్పులు
శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలో మరోసారి కాల్పులు సంభవించాయి. ఓ పార్సిల్ కంపెనీ ప్యాకేజ్ సెక్షన్ వద్ద ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో అతడితో సహా నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని శాన్‌ఫ్రాన్సిస్కోలోని రెండు స్థానిక టీవీ చానెళ్లు ధ్రువీకరించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాన్‌ఫ్రాన్సిస్కోలోని యునైటెడ్ పార్సిల్ సర్వీస్ అనే సంస్థకు చెందిన ఓ ఉద్యోగి కంపెనీ ప్యాకింగ్ హబ్ వద్దకు వెళ్లి అక్కడ తనతోపాటు పనిచేస్తున్న సహచర ఉద్యోగులపై కాల్పులు ప్రారంభించాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుంటుండగానే అదే తుపాకీతో తనకు గురిపెట్టుకొని కాల్చుకున్నాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మొత్తం 350మంది ఉద్యోగులు పనిచేసే ఈ కంపెనీ వద్దకు ఈ ఘటనతో భారీ మొత్తంలో పోలీసులు చేరుకున్నారు. అతడు ఎందుకు ఈ కాల్పులు జరిపాడనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపట్ల కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మరోపక్క, మొత్తం నలుగురు చనిపోవడంతోపాటు మరికొందరు గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.