Gunman Fire
-
పిల్లలు ఏం పాపం చేశారు.. దేవుడా ఎంత పని చేశావు..?
సాక్షి, సిద్దిపేట/ సిద్దిపేట కమాన్: ఆర్థిక సమస్యలు, ఆన్లైన్ రమ్మి గేమ్ ఓ కుటుంబానికి శాపంగా మారింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దగ్గర పీఎస్ఓ (గన్‌మెన్)గా విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక తన భార్య, ఇద్దరు పిల్లలను గన్ తో కాల్చి.. తానూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల నరేశ్(35), చైతన్య(30) దంపతులకు కుమారుడు రేవంత్(7), కూతురు హితాశ్రీ(5) ఉన్నారు. సిద్దిపేట పట్టణంలోని సహస్ర స్కూల్లో చైతన్య టీచర్‌గా వి«ధులు నిర్వహిస్తుండగా.. అదే పాఠశాలలో కుమారుడు రేవంత్ 2వ తరగతి, కుమార్తె హితాశ్రీ ఒకటో తరగతి చదువుతున్నారు. అప్పుల ఊబిలోకి.. రమ్మి గేమ్, ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో నరేశ్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో మూడు నెలల క్రితం గ్రామంలోని ఎకరం వ్యవసాయ భూమిని విక్రయించగా వచి్చన రూ 24.80 లక్షలతో కొంత అప్పు తీర్చాడు. అయినా అప్పుల కొండ కరగలేదు. మరికొంత భూమిని విక్రయిద్దామని ఉమ్మడి కుటుంబ సభ్యులతో చర్చించినా వారు సుముఖత చూపలేదని తెలిసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన నరేశ్.. అప్పు తీర్చే మార్గం కానరాక ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఉలిక్కి పడ్డ రామునిపట్ల సిద్దిపేటలో నివాసం ఉంటున్న నరేశ్ కుటుంబం ఇరవై రోజుల క్రితం రామునిపట్ల గ్రామంలోని తన సొంత ఇంటికి మకాం మార్చింది. నరేశ్ ఇక్కడి నుంచే ప్రతిరోజు డ్యూటీకి వెళ్లి వస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం డ్యూటీకి వెళ్లి నరేశ్ రిపోర్ట్ చేశాడు. కలెక్టర్ సెలవులో ఉండటంతో తిరిగి ఇంటికి వచ్చే ముందు భార్య చైతన్యకు ఫోన్ చేసి స్కూల్ బస్సులో వెళ్లకండి.. తానే స్కూల్‌కు డ్రాప్ చేస్తానని చెప్పాడు. దీంతో స్కూల్ బస్సు ఎక్కాల్సిన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉండిపోయారు. పిల్లలు స్కూల్ యూనిఫాం, కాళ్లకు సాక్స్‌లు ధరించి, లంచ్ బాక్స్‌లు, బ్యాగ్‌లు సర్దుకుని స్కూల్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంటికి చేరుకున్న నరేశ్.. ఇంట్లోకి వెళ్లి తన దగ్గర ఉన్న 9ఎంఎం సరీ్వస్ పిస్టల్‌తో మొదట భార్య చైతన్యను, తర్వాత ఇద్దరు పిల్లలను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం అదే గన్‌తో తన కణతిపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి సీపీ శ్వేత సమాచారం అందుకున్న సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని మీడియాకు తెలిపారు. క్షణికావేశంలో ఒక కుటుంబం బలికావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామని సీపీ తెలిపారు. పిల్లలు ఏం పాపం చేశారు..? ఈ ఘటనతో రామునిపట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నరేశ్ కుటుంబం మొత్తం రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి స్థానికులు కన్నీరమున్నీరయ్యారు. అభం, శుభం తెలియని చిన్నారులు మృతిచెందడంతో ఊరంతా దుఃఖసాగరంలో మునిగితేలింది. చిన్నారుల మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరు అయ్మో పాపం.. పిల్లలు ఏం పాపం చేశారు.. దేవుడా ఎంత పని చేశావు..? అని రోదించారు. కన్న పిల్లలు అని చూడకుండా తండ్రి కర్కశంగా కాల్చి చంపడాన్ని తీవ్రంగా కలచివేసింది. ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు ఒకే గోతిలో ఇద్దరు పిల్లల ఖననం సిద్దిపేటఅర్బన్: ఏఆర్ కానిస్టేబుల్ నరేశ్ కుటుంబం అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య శుక్రవారం అర్ధరాత్రి స్వగ్రామం రామునిపట్లలో ముగిశాయి. వ్యవసాయ బావి వద్ద కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. భార్యాభర్తలు నరేశ్, చైతన్య మృతదేహాలను ఒకే చితిపై దహనం చేశారు. వీరి చితికి నరేశ్ తండ్రి నిప్పంటించారు. ఇద్దరు పిల్లల మృతదేహాలను ఒకే గోతిలో పెట్టి తాత అంత్యక్రియలు నిర్వహించారు. తనకు తలకొరివి పెట్టాల్సిన కుమారుడికి తాను తలకొరివి పెట్టాల్సి వచ్చింది నరేశ్ తండ్రి బోరున విలపించాడు. భార్యాభర్తల చితికి పక్కనే గోతిలో పిల్లల మృతదేహాలను ఖననం చేశారు. టీచర్ల కంటతడి సిద్దిపేట కమాన్: సిద్దిపేట పట్టణం ఆదర్శకాలనీలోని సహస్ర స్కూల్లో చదువుతున్న రేవంత్, హితాశ్రీలు క్లాస్‌లో ఎంతో చురుగ్గా ఉండేవారని, చదువుల్లో ఫస్ట్ వచ్చే వారని ఉపాధ్యాయులు చెప్పారు. ఎంతో అల్లరి చేస్తూ, ముద్దు ముద్దు మాటలతో సందడి చేసేవారని, కానీ నేడు ఇలాంటి పరిస్థితిలో చూస్తామని కలలలో కూడా అనుకోలేదని వారు కంటతడి పెట్టుకున్నారు. చైతన్య కూడా ఎంతో కలుపుగోలుగా ఉండేదని, స్నేహభావంతో మెలిగేవారని తమతో గడిపిన జ్ఞాపకాలను తోటి టీచర్లు గుర్తు చేసుకున్నారు. చైతన్య మృతి కలిచివేసింది ప్రతి రోజు స్కూల్‌కు రాగానే తోటి టీచర్లను తప్పకుండా పలకరిస్తూ లోపలికి వెళ్లేది. ఎంతో కలుపుగోలు తనం, స్నేహభావం ఎక్కువగా ఉండేది. చైతన్య మృతి చెందిన విషయాన్ని నమ్మలేకపోతున్నాం. మమ్మల్ని ఎంతో కలిచివేసింది. శుక్రవారం ఉదయం పాఠశాలకు చైతన్య రాకపోవడంతో తనకు ఉదయం 9గంటలకు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. సుమారు 11:30గంటల సమయంలో ఈ విషయం తెలియడంతో బాధపడ్డాం. – కవిత, తోటి టీచర్ హితాశ్రీ ఎంతో యాక్టివ్ ఘటనలో మృతిచెందిన హితాశ్రీ క్లాస్‌తో ఎంతో యాక్టివ్‌గా ఉండేది. ఎల్కేజీ చదువుతున్న సమయంలో ఇంటెలిజెంట్‌గా ఉండటంతో యూకేజీ కాకుండా నేరుగా ఫస్ట్ క్లాస్‌లోకి ప్రమోట్ చేయడం జరిగింది. పెద్దయ్యాక డాక్టర్ అవుతానని చెప్పేదని.. కానీ, ఇలా అర్థంతరంగా తన జీవితం ముగుస్తుందని అనుకోలేదని చెప్పుకుంటూ సుమలత అనే టీచర్ కన్నీటి పర్యంతమైంది. – సుమలత, టీచర్ అప్పు తీర్చకపోతే చావే మార్గం అంటూ చెప్పేవాడు అప్పులు తీర్చకపోతే తనకు చావు తప్ప వేరే మార్గం లేదని నరేశ్ చెప్పేవాడు. ఈ నెల 10వ తేదీన అప్పులు చెల్లిస్తానని గడువు పెట్టాడు. ఏదో విధంగా ఐదు రోజులు నెట్టుకొచ్చాడు. నిన్న రాత్రి 9 గంటలకు (ఘటనకు ముందు రోజు) సైతం నరేశ్ తనను కలిశాడు. కానీ ఇంత పని చేస్తాడని అనుకోలేదు. నరేశ్‌ను కుటుంబ సభ్యులు పట్టించుకునే వారు కాదు. రూ.10 నుంచి రూ.20లక్షలు సాయం చేస్తే బతికే వాడు. – రాజు, మృతుడి స్నేహితుడు -
కుటుంబంతో గొడవ.. ఆగ్రహంతో 11 మందిని కాల్చిచంపిన వ్యక్తి
ఆగ్నేయ ఐరోపా దేశం మెంటెనెగ్రోలో మాస్ షూటింగ్ ఘటన కలకలం రేపింది. శుక్రవారం ఓ సాయుధుడు తుపాకీతో విధ్వంసం సృష్టించాడు. తన చుట్టుపక్కల ఉన్నవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. అయితే సెటింజేకు చెందిన వ్యక్తి కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడని, ఆ తర్వాత ఇరుగుపొరుగువారిపై తుపాకీతో తూటాల వర్షం కురిపించాడని స్థానిక మీడియా తెలిపింది. ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్పిచంపారు. మాంటెనెగ్రో అంతర్గత వ్యవహారాల శాఖ కూడా ఈఘటనపై స్పందించలేదు. పర్యాటకంగా మంచి గుర్తింపు పొందిన ఈ దేశంలో ఇలాంటి భయానక ఘటన జరగడం దశాబ్దాల్లోనే ఇదే తొలిసారి. చుట్టూ పర్వతాలుండే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రపంచదేశాల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు. అక్కడి పర్యటక రంగానికి ఇదే మంచి సీజన్. ఎక్కువ మంది సందర్శకులు వచ్చే సమయంలో మాస్ షూటింగ్ జరగడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. చదవండి: వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి -
పెళ్లై 8 నెలలు.. కోర్టు ఆవరణలో పోలీసు బలవన్మరణం
సాక్షి, చెన్నై: పని భారమా, కుటుంబ కష్టమా ఏమోగానీ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి గన్‌మన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం కృష్ణగిరి కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణగిరి రైల్వే కాలనీకి చెందిన అన్బరసన్(29) సాయుధ విభాగంలో పోలీసు. కృష్ణగిరి మొదటి మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కలైమదికి గన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం నైట్ షిఫ్ట్‌కు వచ్చిన అన్బరసన్ గురువారం ఉదయాన్నే న్యాయమూర్తి కలై మదితో కలిసి ఆయకోట్టై రోడ్డులోని కోర్టుకు వచ్చాడు. న్యాయమూర్తి తన గదిలోకి వెళ్లిపోవడంతో తాను అక్కడి మెట్లపై కూర్చున్నాడు. కాసేపటికి పైకి లేచిన అన్బరసన్ హఠాత్తుగా తుపాకీని నెత్తిపై పెట్టుకుని కాల్చుకున్నాడు. తుపాకీ పేలిన శబ్దంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. అటు వైపు అందరూ పరుగులు తీశారు. రక్తపు మడుగులో అన్బరసన్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కృష్ణగిరి ఎస్పీ పాండి గంగాధర్, ఏడీఎస్పీ అన్బు, డీఎస్పీ శరవణన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. విచారణలో అన్బరసన్‌కు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. అతడి భార్య నాలుగు నెలల గర్భవతిగా తేలింది. కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే, పనిభారంతో బలన్మరణానికి పాల్పడ్డాడా లేదా కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
కగ్గల్లులో కాల్పుల కలకలం
-
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గన్‌మెన్ కాల్పులు
సాక్షి, కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం కగ్గల్లులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి శనివారం ఉదయం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సమయంలో తిక్కారెడ్డిని గ్రామస్తులు అడ్డుకుంటారనే అనుమానంతో ఆయన గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డితోపాటు, అక్కడే ఉన్న ఏఎస్సై గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. -
అమెరికా ఆస్పత్రిలో కాల్పులు
చికాగో : అమెరికాలో సాయుధ ఉన్మాదుల కాల్పులకు బ్రేక్ పడటం లేదు. తాజాగా చికాగో ఆస్పత్రి పార్కింగ్ ప్రదేశంలో సాయుధ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో గన్‌మెన్ కూడా ఉన్నాడు. తొలుత ఆస్పత్రి పార్కింగ్ ప్రదేశంలో కాల్పులకు తెగబడిన దుండగుడు ఆ తర్వాత ఆస్పత్రిలో ప్రవేశించి కాల్పులు జరిపాడని స్ధానిక మీడియా వెల్లడించింది. చికాగోలోని మెర్సీ ఆస్పత్రిలో జరిగిన కాల్పుల్లో పోలీస్ అధికారి మరణించాడని అధికారులు తెలిపారు. ఆస్పత్రి నుంచి తనకు కాల్పుల శబ్ధాలు స్పష్టంగా వినిపించాయని, పోలీసులు వచ్చిన తర్వాత కాల్పులు నిలిచిపోయాయని ప్రత్యక్ష సాక్షి సూ జిమెనజ్ చెప్పారు. కాగా,ఘటన అనంతరం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. కాల్పులు నిలిచిపోయాయని, రోగులు సురక్షితంగా ఉన్నారని ఆస్ప్రతి వర్గాలు పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడి యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ అధికారిని చికాగో మేయర్ ఇమ్మానుయేల్, పోలీస్ సూపరింటెండెంట్ ఎడీ జాన్సన్ పరామర్శించారు. -
అమెరికా కంపెనీలో ఉద్యోగులపై కాల్పులు
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలో మరోసారి కాల్పులు సంభవించాయి. ఓ పార్సిల్ కంపెనీ ప్యాకేజ్ సెక్షన్ వద్ద ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో అతడితో సహా నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని రెండు స్థానిక టీవీ చానెళ్లు ధ్రువీకరించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాన్ఫ్రాన్సిస్కోలోని యునైటెడ్ పార్సిల్ సర్వీస్ అనే సంస్థకు చెందిన ఓ ఉద్యోగి కంపెనీ ప్యాకింగ్ హబ్ వద్దకు వెళ్లి అక్కడ తనతోపాటు పనిచేస్తున్న సహచర ఉద్యోగులపై కాల్పులు ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుంటుండగానే అదే తుపాకీతో తనకు గురిపెట్టుకొని కాల్చుకున్నాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మొత్తం 350మంది ఉద్యోగులు పనిచేసే ఈ కంపెనీ వద్దకు ఈ ఘటనతో భారీ మొత్తంలో పోలీసులు చేరుకున్నారు. అతడు ఎందుకు ఈ కాల్పులు జరిపాడనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపట్ల కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మరోపక్క, మొత్తం నలుగురు చనిపోవడంతోపాటు మరికొందరు గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.