
అన్బరసన్ మృతదేహం
సాక్షి, చెన్నై: పని భారమా, కుటుంబ కష్టమా ఏమోగానీ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి గన్‌మన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం కృష్ణగిరి కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణగిరి రైల్వే కాలనీకి చెందిన అన్బరసన్(29) సాయుధ విభాగంలో పోలీసు. కృష్ణగిరి మొదటి మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కలైమదికి గన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం నైట్ షిఫ్ట్‌కు వచ్చిన అన్బరసన్ గురువారం ఉదయాన్నే న్యాయమూర్తి కలై మదితో కలిసి ఆయకోట్టై రోడ్డులోని కోర్టుకు వచ్చాడు. న్యాయమూర్తి తన గదిలోకి వెళ్లిపోవడంతో తాను అక్కడి మెట్లపై కూర్చున్నాడు. కాసేపటికి పైకి లేచిన అన్బరసన్ హఠాత్తుగా తుపాకీని నెత్తిపై పెట్టుకుని కాల్చుకున్నాడు.
తుపాకీ పేలిన శబ్దంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. అటు వైపు అందరూ పరుగులు తీశారు. రక్తపు మడుగులో అన్బరసన్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కృష్ణగిరి ఎస్పీ పాండి గంగాధర్, ఏడీఎస్పీ అన్బు, డీఎస్పీ శరవణన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. విచారణలో అన్బరసన్‌కు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. అతడి భార్య నాలుగు నెలల గర్భవతిగా తేలింది. కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే, పనిభారంతో బలన్మరణానికి పాల్పడ్డాడా లేదా కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.