శ్వాస సిగరెట్‌ పొగలా వచ్చేదట..! | Shot at Coldest Place on Earth Picture Goes Viral | Sakshi
Sakshi News home page

శ్వాస సిగరెట్‌ పొగలా వచ్చేదట..!

Published Wed, Jan 17 2018 5:35 PM | Last Updated on Wed, Jan 17 2018 5:43 PM

Shot at Coldest Place on Earth Picture Goes Viral - Sakshi

ఓమియాకాన్‌లో చలి తీవ్రతకు గడ్డ కట్టుకుపోయిన కనుబొమ్మలు

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : చలి చలిగా అల్లింది.. గిలి గిలిగా గిల్లింది... జనవరి మాసం అరె మంచు కురిసే సమయం... ఇలా చలి గురించి మనకు ఎన్నో పాటలున్నాయి. పాటలు పాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ, నిజంగా అంతటి చలిలో ఉంటే ఎలా ఉంటుంది?. రష్యాలోని ఓమియాకాన్‌ భూమ్మీద అత్యంత శీతల ప్రాంతం. అత్యంత శీతలంగా ఉండే ఈ ప్రాంతంలో వేడి నీటి కుంటలు ఉన్నాయి.

ఓమియాకాన్‌ అంటే ‘గడ్డ కట్టని నీరు’  అని అర్థం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వేడి నీటి కుంటల కారణంగానే ఓమియాకాన్‌ అభివృద్ధిపై రష్యాను దృష్టి సారించేలా చేసింది. రెయిన్‌ డీర్‌లకు నీటిని అందించేందుకు ఓమియాకాన్‌లో నివాసం ఉండే 50 మంది కుంటలను వినియోగిస్తుంటారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇక్కడి ఉష్ణోగ్రతలు దాదాపు -50 డిగ్రీలకు పడిపోతాయి.

ఆ సమయంలో వెచ్చదనం కోసం కర్ర, బొగ్గులను మండించి చలి కాచుకుంటారు ఓమియాకాన్‌ వాసులు. సముద్రమట్టానికి 750 మీటర్ల ఎత్తులో ఉన్న ఓమియాకాన్‌లో డిసెంబర్‌ నెల నుంచి వేసవి వరకూ పగటి పూట సమయాల్లో విపరీతమైన మార్పులు ఉంటాయి. ఒక్కోరోజు కేవలం మూడు గంటలు మాత్రమే పగటి సమయం ఉంటుంది. ఒక్కోసారి పగటి సమయం అత్యధికంగా 21 గంటలు వరకూ ఉంటుంది.

ఓమియాకాన్‌లో కేవలం ఒకే ఒక దుకాణం, పాఠశాల ఉన్నాయి. -52 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే వాటిని మూసేస్తారు. అలాంటి ప్రదేశంలో అడ్వెంచర్‌ ఫోటోగ్రాఫర్‌ అమోస్‌ చాపెల్‌ అక్కడి వాతావరణాన్ని, పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఐదు వారాల పాటు ఓమియాకాన్‌లో పర్యటించిన చాపెల్‌ చలి తన కాళ్లను పట్టుకున్నట్లు, నోట్లోని లాలాజలం గడ్డ కట్టి, పెదవులని గుచ్చుతున్నట్లు అనిపించిందని చెప్పారు.

శ్వాస తీసుకుని వదులుతుంటే అది పొగలా కనిపించేదని తెలిపారు. ఫొటోలను తీసే సమయంలో శ్వాసను బిగబట్టినట్లు చెప్పారు. ఓమియాకాన్‌ వాసులు నీటిలోకి వెళ్లడానికి భయపడతారని తెలిపారు. అలాంటిది చైనా యాత్రికులు అక్కడి నీటిలో ఈత కొట్టడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అనస్థేసియా అనే అమ్మాయి స్నేహితులతో కలసి ఓమియాకాన్‌ను సందర్శించిన సమయంలో దిగిన ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియా వైరల్‌గా మారింది. అనస్థేసియా సోషల్‌మీడియాలో పోస్టు చేసిన ఫొటోల్లో వారి కనుబొమ్మలు కూడా మంచు తీవ్రతకు గడ్డకట్టుకుపోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement