ఉగ్రవాదిని పట్టించి హీరో అయ్యాడు
న్యూయార్క్: అమెరికాలో ఓ సిక్కు పౌరుడు హీరో అయ్యాడు. అక్కడి పోలీసులతోనే కాకుండా సాధారణ పౌరులతో కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు. కానీ, అతడు మాత్రం తాను ఇందులో పెద్దగా చేసిందేమీ లేదని.. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా చేయాల్సిన పనినే తాను చేశానని అంటున్నాడు. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ వారాంతపు రోజుల్లో భారీ పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లకు కారణమైన అనుమానిత 28 ఏళ్ల అప్గన్ సంతతి అమెరికా ఉగ్రవాదిని హరిందర్ బెయిన్స్ అనే ఓ సిక్కు పౌరుడు గుర్తించాడు. ఈయన లిండన్ లో ఓ బార్ షాపు యజమాని.
న్యూయార్క్, న్యూజెర్సీలో వారాంతపు రోజుల్లో ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడులకు కారణమైన వ్యక్తికోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడికి కారణమైన అహ్మద్ ఖాన్ రహామీ అనే ఉగ్రవాది తన ముందు నుంచి వెళుతుండటం హరిందర్ బెయిన్స్ గుర్తించాడు. వేరే వీధిలో పనిలో ఉన్న అతడు తన ల్యాప్ టాప్ లో వార్తలు చూస్తూ అతడిని గుర్తించాడు. తొలుత తన ముందు నుంచి వెళుతున్న అహ్మద్ ను చూసి తాగేందుకు వచ్చిన యువకుడు అనుకున్నాడు. అనంతరం వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రాగా ఆ ఉగ్రవాది కాల్పులు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలయినా చివరకు అతడిపై మరిన్ని కాల్పులు జరిపి పట్టుకోగలిగారు.