'ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం'
వాషింగ్టన్: తమపై అమెరికన్లకు అవగాహన కల్పించేందుకు అమెరికాలోని సిక్కులు నడుంకట్టారు. ఆ దేశంలో తమవారిపై జరుగుతున్న హత్యాకాండలు, హింసపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ మున్ముందు అలాంటివి జరగకుండా చేసేందుకు భారీ మొత్తంలో ప్రచార కార్యక్రమాలు తలపెట్టారు. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేనంతగా దాదాపు రూ.2,68,00,000(నాలుగు లక్షల డాలర్లు) విరాళాలు పోగేశారు. ఈ మొత్తాన్ని అమెరికా వ్యాప్తంగా పర్యటించి తమ గురించి, అమెరికాలో తమ విశ్వాసాల గురించి, నమ్మకాల గురించి ప్రచారానికి ఉపయోగిస్తారు.
ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాల కోసం అత్యధికంగా 90 వేల డాలర్లే అధిక మొత్తంలో విరాళాలుగా రాగా ఈసారి ఆశ్యర్యపడేలా భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయి. నేషనల్ సిక్ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. 'అమెరికాలోని సిక్కులకు ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఘట్టం. గతంలో ఎన్నడూ లేనంతగా తమ గురించి చెప్పుకునే అవకాశం ఈ విరాళాల ద్వారా వచ్చింది. దేశ వ్యాప్తంగా పర్యటించి సిక్కుల విశ్వాసాలు, నమ్మకాల గురించి అమెరికన్లకు వివరించి సిక్కులపై జరుగుతున్న దాడులను పూర్తిగా తగ్గించేస్తాం. సిక్కులు మరింత భద్రంగా ఉండేలా కృషిచేస్తాం' అని ఎన్ఎస్ సీ సభ్యుడు కావాల్ కౌర్ చెప్పారు.