అమెరికన్ ‘ఎవడు’!
ఎవడు సినిమా చూశారా? అందులో హీరో అల్లు అర్జున్ ముఖం కాలిపోవడంతో చనిపోయిన మరో హీరో రాంచరణ్ తేజ్ ముఖాన్ని అమరుస్తారు. ఇదీ అదే స్టోరీ! సినిమా కన్నా ముందే అమెరికాలో నిజంగా జరిగింది. కథలోకెళితే..
రిచర్డ్ లీ నోరిస్ అనే వర్జీనియా యువకుడు ఓ రోజు తప్పతాగి ఇంటికొచ్చాడు. తల్లి చెడామడా తిట్టేసింది. మనోడు నాటు తుపాకీ అందుకున్నాడు.
దవడ కింద ఉంచుకుని కాల్చుకుంటానని బెదిరించాడు. ఆమె వెనక్కి తగ్గడంతో తుపాకీ కిందకి దించాడు. తూటా పైకి దూసుకుపోయింది. ఇంకేం.. ముఖం పచ్చడైంది. దవడలు పగిలాయి. ముక్కు ఎగిరిపోయింది. నాలుక ఒక్కటే మిగిలి.. నోటి భాగంలో పెద్ద బొక్క పడింది! 1997లో ఇది జరిగింది. అప్పటి నుంచి 18 ఏళ్లు నరకం చూశాడు. 30 శస్త్రచికిత్సలు జరిగాయి.
ముఖం వికృతంగా తయారైంది. ముఖం మార్చకపోతే చస్తాడు. మారిస్తే బతికే చాన్స్ 50 శాతమేనని వైద్యులు తేల్చారు. నిత్యనరకానికి తోడు బయటకెళ్లడమే మానేశాడు. వెళ్లాల్సి వస్తే పెద్ద టోపీ, మాస్కుతో ముఖాన్ని కప్పుకునేవాడు. ఆత్మహత్య గురించీ ఆలోచించాడు. ఇంతలో ఇతనికోసమే అన్నట్లు.. మూడేళ్ల క్రితం జోషువా అవెర్సనో(21) అనే యువకుడు కారు ప్రమాదంలో మరణించాడు. అతడి ముఖాన్ని దానం చేసేందుకు కుటుంబం అంగీకరించింది.
దీంతో ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ ప్రొఫెసర్ డాక్టర్ ఎడ్వర్డో రోడ్రిగ్ నేతృత్వంలోని 150 మంది వైద్యుల బృందం 36 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ పూర్తిచేసింది. కొత్తముఖంతో మరో జన్మెత్తిన నోరిస్‌ను జోషువా సోదరి రెబెకా ఇటీవల తొలిసారిగా కలుసుకుంది. చనిపోయిన తన సోదరుడి ముఖాన్ని మళ్లీ సజీవంగా చూసుకుని ఆనందబాష్పాలు రాల్చింది.
అయితే.. కథ సగమే సుఖాంతమైంది! ఎందుకంటే నోరిస్ వయసు ప్రస్తుతం 39. అంతా సవ్యంగా జరిగితే కొత్త ముఖం 20 నుంచి 30 ఏళ్లు పనికొస్తుందట. కొత్త ముఖాన్ని దేహం తిరస్కరించకుండా ఉండేందుకు జీవితాంతం మందులు వాడాలి. మళ్లీ మందుకొట్టినా, పొగ తాగినా, గాయం అయినా.. కొత్త ముఖాన్ని దేహం తిరస్కరిస్తుంది! అందుకే.. ఎప్పుడు కొత్త ముఖాన్ని దేహం తిరస్కరిస్తుందో.. ఎప్పుడు మృత్యువు ముంచుకొస్తుందోనన్న భయంతోనే ఇతడు రోజూ నిద్రలేస్తున్నాడు.