కాబూల్: పాకిస్తాన్‌లోని పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో కొంత మంది యువకులు, వృద్ధులు చీకటి పడగానే లేదా తెల్లవారు జామున సందు చివరలో రాళ్లు రప్పలు వెతుక్కుంటూ పోతారు. మరి కొందరు ఊరు చివరనున్న పొలాల గంట్ల వెంబడి తేలు కుట్టిన దొంగల్లా బొరియల్లోకి పుల్లలు పెట్టి ఏదో వెతుకుతుంటారు. ఏంటని అడిగితే సమాధానం ఉండదు. వారి మొఖాలు చూస్తుంటే అదోలా ఉంటాయి. దేనికో బానిసైనట్లు అవి చెప్పకనే చెబుతుంటాయి.
అవును! వారంతా తేళ్ల (స్కార్పియన్స్) పొగకు బానిసైన మత్తు భాయిలు. వారు వెతికేది, ఆరాటపడేది తేళ్ల కోసమే. వారంతా అలా తీసుకొచ్చిన తేళ్లను చంపేసి ఓ డబ్బాలో దాస్తారు. స్టవ్ మీద బొగ్గును కాల్చి ఒకసారికి ఒక తేలు చొప్పున ఎర్రగా కాలిన నిప్పుపై వేస్తారు. అది కాలుతుంటే సమరు సమరుగా వచ్చే పొగను అదే పనిగా పీలుస్తారు. ఆ పొగ కారణంగా తెలియని మత్తులోకి వెళ్లి తన్మయత్వంలో తూలిపోతుంటారు. అందులో మత్తును ఎక్కువగా ఇస్తూ ఘాటైన పొగను విడుదల చేసేది తేలు శరీరంలోని తేలుకొండి. దానిలో ఉండే విష పదార్థం కాలుతుంటే ఘాటైన మత్తు వస్తుందని 74 ఏళ్ల సోహబత్ ఖాన్ మీడియాకు తెలిపారు.
జనరల్ అయూబ్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఉన్నప్పుడు తనకు 20 ఏళ్లని, అప్పుడు పెషావర్‌లోని జలీల్ ఖబాబ్ హౌస్‌కు వెళ్లే వాడినని అక్కడ ఈ తేలు పొగ పీల్చడమనే పాడు అలవాటు మొదలైందని చెప్పారు. అప్పట్లో తనకు భారతీయ కరెన్సీలో రూపాయి, రెండు రూపాయలకు చొప్పున ఓ వెండర్ తేళ్లు విక్రయించేవాడని చెప్పారు. కాల్చిన తేలు కొండిని సిగరెట్ పొగాకులో పెట్టుకొని తాను పీల్చేవాడినని, దాని ప్రభావం కనీసం పది గంటలు ఉంటుందని, ఆరు గంటలు మాత్రం నరక యాతన అనుభవించాల్సి ఉంటుందని, ఆ తర్వాత నాలుగు గంటలు అదో లోకంలో తేలిపోతున్నట్టు ఉంటుందని అన్నారు.
మన కళ్ల ముందు కనిపించే ఇల్లు, వాకిలి, రోడ్డు, రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనం డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుందని ఖాన్ వివరించారు. ఆయన ఈ పాడు అలవాటును ఎప్పుడో వదిలేసి నల్ల మందుకు అలవాటు పడ్డారు. ఎందుకలా కొత్త అలవాటుకు వెళ్లావంటే ‘ఒక మత్తు మరో మత్తును జయిస్తుంది’ అని చెప్పారు. తేలుపొగతో పోలిస్తే నల్ల మందు చాలా బెటర్ అని అన్నారు. కొంత మంది తేళ్లను ఒరుగుల్లా ఎండబెట్టి నిప్పుపై కాల్చి పొగ పీలుస్తారని అన్నారు. కేవలం ఇప్పుడు కూడా ఈ అలవాటుకు బానిసలైన వారు వంద రూపాయల నుంచి 150 రూపాయలు వెచ్చించి ఒక్కో తేలును కొంటున్నారని తెలిపారు. తేలు పొగ వల్ల తన దవడలు లొట్టలు పడ్డాయని, కళ్లు గుంతలు పడ్డాయని, మొఖమంతా పాలిపోయిందని చెప్పారు.
తేలు పొగ మానవ మెదడుకు చాలా ప్రమాదకరమని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి నశిస్తుందని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అజాజ్ జమాల్ తెలిపారు. తేళ్లలో 1750 రకాలు ఉన్నాయని, వాటిలో 25 రకాల తేళ్లు కుడితే మనిషి ప్రాణాలు కూడా పోతాయని ఆయన చెప్పారు. తేలుపొగను పీల్చడం వల్ల నిద్రలేమి వస్తుందని, జీర్ణ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయని ఆయన చెప్పారు. ఈ అలవాటు ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పారు. భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అలవాటు ఉందని ఆయన అన్నారు. ఎక్కువ మంది గుట్టు చప్పుడు కాకుండా తేలు పొగ తాగుతుండడం వల్ల సరైన డేటా అందుబాటులో లేదని, ఐక్యరాజ్య సమితి డ్రగ్ ఆఫీసు కూడా ఈ విషయంలో ఎలాంటి పరిశోధనలు సాగించలేదని ఆయన చెప్పారు.
పఖ్తుంఖ్వా ప్రాంతంలోని బన్ను, కొహాత్, కరక్, దిగువ దిర్, ఎగువ దిర్, బత్కేలా ప్రాంతాల్లో ఇలాంటి పొగరాయుళ్లు ఎక్కువ మంది ఉన్నారని ఖైబర్ పఖ్తుంఖ్వా నార్కోటిక్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి రిటైర్డ్ అయిన అజీముల్లా తెలిపారు. ఈ అలవాటు డ్రగ్స్ కన్నా డేంజర్ అని ఆయన చెప్పారు. ఒకసారి ఈ అలవాటుకు బానిసైతే ఎప్పుడు ఏదో తెలియని భ్రమల్లో మనిషి బతుకుతాడని ఆయన అన్నారు. ఎయిడ్స్, క్యాన్సర్ మందులో తేలుకొండి విషాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని, తేళ్లను పాడలవాటు కోసం చంపుతుంటే అవసరమైన ఔషధాలకు కొరత ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఔషధాల కోసమైన తేళ్లను చంపడాన్ని పాక్ ప్రభుత్వం నిషేధిస్తూ కఠినమైన చట్టాలను తీసుకొచ్చినట్లయితే ఈ పాడు అలవాటు కూడా తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘తేలు పొగ’ తెగ పీలుస్తున్నారు!
Published Fri, Apr 29 2016 5:46 PM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM
Advertisement
Advertisement