ఎన్నిరోజులు వేసుకున్నా ఈ సాక్స్ కంపు కొట్టవు!
నాగరికుడు కావడంలో మనిషికి ఎదురయ్యే అతిముఖ్యమైన సమస్య సాక్స్. షూ విప్పగానే సాక్స్ గుప్పున కంపుకొడితే.. వాడు అనాగరికుడికిందే లెక్క! సినిమాల్లో సాక్స్ ల వాసన మీద బోలెడన్ని సీన్లు, పేజీలకొద్దీ డైలాగులు రాసేది కూడా మనల్ని నాగరికులు కమ్మని చెప్పేందుకే! అఫ్ కోర్స్, ఆ రాసేవాడు మంచి సాక్స్ లు వేసుకుంటాడా లేదా చెప్పలేమనుకోండి! రోజుకో సాక్స్ జత వేస్తే ఉతికేవాళ్లకు బాధ, రోజూ ఒకటే వేసుకుంటే పక్కవాళ్లకు బాధ. మరిలాంటప్పుడు ఏం చెయ్యాలి?
డీసెంట్ గా మారుతున్న జీవితాల్లో అన్ డీసెన్సీలా మారిన ఈ సాక్స్ వ్యథకు గొప్ప ముగింపు పలికారు స్టీవ్, జెన్నీ దంపతులు. ఎన్ని రోజులు వేసుకున్నా వాసనరాని సాక్స్ ను ఈ మధ్యే తయారుచేశారు వీళ్లు. శాంపిల్ గా బంధువులతో, తెలిసినవాళ్లతో ఈ కొత్తరకం సాక్స్ లు తొడిగించారు. 'అద్భుతం.. ఏడునెలలు వేసుకున్నా సాక్స్ వాసనరాలేదు!' అని ఒకరు, 'ఏడాది వేసుకున్నా ఏమీ కాలేదు'అని మరొకరు స్టీవ్, జెన్నీ ల సాక్స్ ల పనితీరును ప్రశంసించారట.
ఈస్ట్ డెవోన్ (ఇంగ్లాడ్)లో నివసించే ఈ జంటకు ఓ గోట్ ఫామ్ (కోళ్ల ఫారం లాగా మేకలను పెంచే ఫామ్ అన్నమాట) ఉంది. అందులో వందలాది అంగోరా జాతి మేకలున్నాయి. ఇతర మేకలతో పోల్చుకుంటే అంగోరా మేకల ఒంటిపై బొచ్చుబాగా పెరుగుతుంది. రకరకాల ప్రయోగాల తర్వాత అంగోరా మేకనుంచి సేకరించిన ఉన్నికి వాసనను నిరోధించే గుణం ఉంటుందని కనిపెట్టిన స్టీవ్ దంపతులు.. దానితో సాక్స్ తయారుచేశారు. ఆనోటా ఈనోటా వాసన రాని సాక్స్ కు పబ్లిసిటీ పెరిగి క్రమంగా కస్టమర్లు పెరిగారు.