‘సౌర’ మార్గం
ఫ్రాన్స్‌లో వెయ్యి కిలోమీటర్ల ‘కొత్త’ రోడ్లు వేస్తున్నారట! ఇందులో గొప్పేముంది... అంతకంటే ఎక్కువ పొడవు రోడ్లు ఇక్కడా వేస్తున్నారు కదా అంటున్నారా. నిజమేకానీ... ఈ కొత్త రోడ్లు మొత్తం సోలార్ ప్యానెల్స్‌తో నిర్మాణమవుతాయి. మరి ట్రాఫిక్? అదేనా మీ అనుమానం. ఏం ఫర్వాలేదు. అంతా మామూలుగానే సాగిపోతుంది అంటున్నారు వాట్‌వే కంపెనీ ప్రతినిధులు.
ఫ్రాన్స్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోలార్ ఎనర్జీ సహకారంతో ఈ సోలార్ రోడ్లు వేస్తున్నది ఈ కంపెనీనే! ఉన్న రోడ్లను ఏ మాత్రం తవ్వకుండా... వాటిపైనే దాదాపు ఏడు మిల్లీమీటర్ల మందంతో కూడిన సోలార్ ప్యానెల్స్‌ను అతికించడం ద్వారా సోలార్ రోడ్లు తయారవుతాయి. బాగానే ఉంది కానీ... ఈ రోడ్లతో ఎంత కరెంట్ ఉత్పత్తి అవుతుంది? కచ్చితంగా తెలియదుగానీ..
20 చదరపు మీటర్ల సోలార్ ప్యానెల్స్‌తో ఫ్రాన్స్‌లో ఒక ఇంటికి సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునట. కిలోమీటర్ పొడవైన సోలార్ రోడ్డుతో 5000 మంది ఉండే ప్రాంతపు వీధిదీపాలను వెలిగించవచ్చు. ఇలాంటి రోడ్లు భారత్‌లోనూ వేస్తే భలే ఉంటుంది కదూ!