అచ్చమైన సోలార్ కారు!
పెట్రోలు కంటే కరెంటు చౌక... సౌరశక్తితో విద్యుదుత్పత్తి చేసుకుంటే మరీ మేలు. ఈ విషయాన్ని జర్మనీ స్టార్టప్ కంపెనీ సోనో మోటార్స్ బాగా అర్థం చేసుకున్నట్లు ఉంది. అందుకే ఈ కంపెనీ సరికొత్త కారునొకదాన్ని డిజైన్ చేసింది. ఫొటోలో కనిపిస్తున్న ఆ కారు మోడల్‌ను చూస్తేనే విషయం మీకు అర్థమైపోతుంది. అవునండీ... ఇది అచ్చమైన సోలార్ కారు.
కారు బాడీపై అన్నివైపులా ఒక పద్ధతి, డిజైన్ ప్రకారం ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ఎప్పటికప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేసి, దాన్ని బ్యాటరీల్లో నింపుతాయి. ఆరుబయట దీన్ని పార్క్ చేస్తే చాలు. ఈ ప్యానెల్స్ ఒక పూటకు దాదాపు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. మిగిలిన ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే దీన్ని చార్జ్ చేసుకోవచ్చు.
ఇంకోలా చెప్పాలంటే మీరు రోజుకు 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించేవారైతే... మీ ఇంధన ఖర్చు జీరో! అంతేకాదు... ఈ కారులో ఏసీ అవసరం లేకుండా గాల్లోని తేమనే నీటిగా మార్చి చల్లటి గాలినిచ్చే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది దుమ్మూధూళి కణాలను కూడా ఫిల్టర్ చేస్తుంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇప్పటికే దాదాపు రెండు లక్షల డాలర్లు సమకూర్చుకున్న సోనోమోటార్స్ 2018 నాటికల్లా కార్లను మార్కెట్‌లోకి తెస్తామంటోంది. రెండే మోడళ్లలో లభించే ఈ కార్ల ధరలు... తొమ్మిది నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకూ ఉండవచ్చు.