
పోలీసుల దిమ్మ తిరిగింది..
దక్షిణ కరోలినా : మూడు రోజుల పాటు సోదాలు, ట్రాక్టర్ల కొద్దీ మారణాయుధాలు.. వేల సంఖ్యలో తుపాకీలు... ఇవీ ఓ నేరస్థుడి ఇంట్లో దొరికిన సరకు సరంజామా. అమెరికా పేజ్‌ల్యాండ్ సిటీకి చెందిన బ్రెంట్ నికోల్సన్ (51) కథ కమామిషు ఇది. మత్తుమందులు హెరాయిన్, ఒపియం అమ్ముతున్నట్టుగా అతనిపై అభియోగాలు ఉన్నాయి. అయితే పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న బ్రెంట్ నికోల్సన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.
దీని ఆధారంగా అతడి ఇంటిని సోదా చేయడానికి వెళ్లిన పోలీసులు దిమ్మ తిరిగింది. బాణాలు, మందుగుండు సామాగ్రి, ఎయిర్ కంప్రెషర్స్ ఇలా ఒకటా రెండు వేలకొద్దీ మారణాయుధాలు. వీటన్నింటినీ చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా పదివేల తుపాకులు దొరికాయి. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్యారేజ్ నుంచి తీస్తున్న కొద్దీ ట్రాక్టర్లు నిండిపోయాయి. అయినా ఓ దశలో లెక్క చిక్కలేదు. అవి కూడా సరదాగా సేకరించినవో.. కొన్నవో కాదు సుమా. బ్రెంట్ నికోల్సన్ దొంగతనంగా ఎత్తుకొచ్చిన ఆయుధాలు. అక్కడా ఇక్కడ కొట్టేసినవన్నీ ఇంట్లో దాచుకున్నాడతను. ఆ ఇంట్లో సోదాలకు వెళ్లిన తాము తుపాకులు లెక్కపెట్టలేక సొమ్మసిల్లిపోయామని..తమ సర్వీసులో ఇలాంటి కేసును చూడలేదని పోలీసు అధికారి తెలిపారు.
అయితే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో వారు అన్వేషణ మొదలుపెట్టారు. పోలీసులు సుమారు మూడు రోజులు పాటు ఈ దాడులు కొనసాగించారు. దాడుల్లో ఆయుధాలతో పాటు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన సొత్తు విలువ ఏడు కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 150 రంపాలు, 300 మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.