![దక్షిణ సుడాన్ అధ్యక్షుడు సాల్వా కీర్, తిరుగుబాటు దళాల అధిపతి రిక్ మచార్ (కుడి)](/styles/webp/s3/article_images/2017/09/3/51440602326_625x300.jpg.webp?itok=qdTFzLpQ)
దక్షిణ సుడాన్ అధ్యక్షుడు సాల్వా కీర్, తిరుగుబాటు దళాల అధిపతి రిక్ మచార్ (కుడి)
జుబా: అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న ప్రపంచంలోనే అతిపిన్న దేశం దక్షణ సుడాన్లో శాంతి స్థాపనకు బీజం పడింది. తిరుగుబాటు దళాలకు, ప్రభుత్వానికి మధ్య బుధవారం శాంతి ఒప్పందం జరిగింది. దీంతో నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడినట్లయింది.
రాజధాని నగరం జుబాలో బుధవారం దేశాధ్యక్షుడు సాల్వా కీర్, తిరుగుబాటు దళాల నాయకుడు రిక్ మచార్ ల ప్రతినిధులు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. నిజానికి గతవారమే ఈ ఒప్పందం జరగాల్సిఉండేది కానీ తిరుగుబాటుదారుల డిమాండ్లకు అధ్యక్షుడు సల్వా నో చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
కాగా, శాంతిఒప్పందానికి అంగీకరించకుంటే అంతర్జాతీయ సమాజం నుంచి బహిష్కరణ వేటు తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడంతో సాల్వా దిగివచ్చారు. శాంతి ఒప్పందం విజయవంతానికి దక్షిణ సుడాన్ పొరుగుదేశాలైన కెన్యా, ఉగాండా, ఇథియోపియా తదితర దేశాల అదినేతలు సహకరించారు.
2011లో దక్షిణ సుడాన్ స్వతంత్ర్యదేశంగా ఆవిర్భవించింది. అధ్యక్షుడు సాల్వా.. ఉపాధ్యక్షుడైన రిక్ మచార్ ను పదవి నుంచి తొలగించడంతో ప్రారంభమైన విబేధాలు తీవ్ర రూపందాల్చి అంతర్యుద్ధానికి దారితీసింది. నేటి శాంతి ఒప్పందంతో రిక్ తిరిగి ఉపాధ్యక్ష పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది.