మృత్యు బేహారి... | special story on north korean leader kim jong un 300 murders | Sakshi
Sakshi News home page

మృత్యు బేహారి...

Published Wed, Feb 15 2017 9:30 PM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

మృత్యు బేహారి... - Sakshi

మృత్యు బేహారి...

తండ్రి చనిపోయాక 2011లో వారసత్వంగా ఉత్తరకొరియా సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన కిమ్‌ జాంగ్‌ ఉన్‌ నిరంకుశుడిగా పేరుపడ్డారు. విలాసవంతమైన జీవితం గడిపే ఈ నియంతకు అభద్రతాభావం ఎక్కువ. అనుమానం పాలూ ఎక్కువే. తన అధికారాన్ని ఎవరు ప్రశ్నించినా, ఎదురు మాట్లాడినా సహించలేడు. ఎవరినీ నమ్మని ఈయన తన మంత్రివర్గంలోని పలువురని, సీనియర్‌ మిలటరీ అధికారులను దారుణంగా చంపించాడు. అధికారిక సమావేశాల్లో నిద్రపోయాడని, నిర్లక్ష్య ధోరణిలో కూర్చున్నాడని, అధినేత పట్ల అగౌరవం చూపాడని... ఇలా ఎన్నో కారణాలు. ఆయనకు కోపం వచ్చిందంటే అవతలివాడి ప్రాణాలు గాల్లో కలిసినట్లే. ఆఖరికి భార్య మాజీ కోలిగ్స్‌ను కూడా చంపించివేశాడు.

ఉత్తరకొరియాకు తానే తిరుగులేని నేతనని చాటేందుకు కూడా కొందరిని హతమార్చాడు. దేశ రాజకీయాలపై, అధికారంపై ఏమాత్రం ఆసక్తి లేని, ఎక్కడో మకావులో జీవిస్తున్న సోదరుడు (మరో తల్లికి జన్మించారు) కిమ్‌ జాంగ్‌ నామ్‌ కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలో మంగళవారం విషప్రయోగం ద్వారా హత్యకు గురయ్యాడు. దీని వెనుక కూడా కిమ్‌ జాంగ్‌ ఉన్‌ హస్తం ఉందనే అనుమానాలున్నాయి. ఉన్‌ అధికారం చేపట్టిన ఐదేళ్లలో 300 మంది పైచిలుకు మరణదండనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఉత్తరకొరియా నియంత చేసిన కిరాతకాల్లో కొన్ని...

జాంగ్‌ సాంగ్‌ తయెక్‌: ఉన్‌ మేనత్త కిమ్‌ కియాంగ్‌ హుయ్‌ని పెళ్లాడిన తయెక్‌ ఉత్తరకొరియా ప్రభుత్వంలో రెండోస్థానంలో ఉండేవారు. జాతీయ డిఫెన్స్‌ కమీషన్‌ వైస్‌–చైర్మన్‌గా కీలక పదవిలో ఉన్న ఈయన పాలనలో అనుభవం లేని ఉన్‌కు మార్గదర్శకుడిగా వ్యవహరించారు. 2013 డిసెంబరులో ప్రభుత్వాన్ని కూల్చడానికి, తిరుగుబాటుకు కుట్ర చేస్తున్నాడనే ఆరోపణలతో మిలటరీ కోర్టులో విచారించి కాల్చి చంపారు. తర్వాత తయెక్‌ సోదరిని, ఆమె భర్తను, వీరి కుమారుడిని, సోదరి భర్త తమ్ముడిని కూడా కడతేర్చారు. చివరకు మేనత్త హుయ్‌ని కూడా వదలకుండా నిర్ధయగా చంపించి వేశాడు.

చోయ్‌ యాంగ్‌ గోన్‌ (వైస్‌ ప్రీమియర్‌): అధినేత అటవీ పాలసీతో విభేదించినందుకు మే, 2015లో ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియాతో మంచి సంబంధాలు కలిగిన ఈయనకు కొద్దినెలల కిందటే వైస్‌ ప్రీమియర్‌గా ప్రమోషన్‌ ఇచ్చి దయాదికి సానుకూల సంకేతాలు పంపిన ఉన్‌ తర్వాత కొంతకాలానికే ఆగ్రహించారు.

కిమ్‌ యాంగ్‌ జిన్‌ (వైస్‌ ప్రీమియర్‌– విద్య): పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫైరింగ్‌ స్క్వాడ్‌తో 2016 ఆగష్టులో కాల్చి చంపించారు. అసలు కారణం మాత్రం పార్లమెంటు సమావేశాల్లో సరిగా కూర్చొలేదని, నిర్లక్ష్యధోరణిలో ఆసీనుడయ్యాడని కిమ్‌ జిన్‌పై ఉత్తరకొరియా నియంతకు కోపం వచ్చిందట.

హ్యోన్‌ యాంగ్‌ చోల్‌ (రక్షణ మంత్రి): ఉన్‌ హాజరైన ఒక మిలటరీ పరేడ్‌లో కునుకు తీస్తూ కెమెరాలకు చిక్కాడు. చోల్‌ తనకు సన్నిహితుడైనప్పటికీ ఉన్‌ దయ చూపలేదు. ప్యాంగ్‌యాంగ్‌కు సమీపంలోని మిలటరీ అకాడమీలో వందలాది మంది చూస్తుండగా ఏప్రిల్‌ 30, 2015న చోల్‌ను యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్‌తో కిరాతకంగా కాల్చి చంపించాడు. నిజానికి పలు విధానపరమైన నిర్ణయాలతో విబేధించినందుకే చోల్‌ ప్రాణాలు తీశారని కొన్ని వార్తా సంస్థలు రాశాయి.

రి యాంగ్‌ హో (ఆర్మీ చీఫ్‌): కొరియా వర్కర్స్‌ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఈయన 2012లో కాల్పుల్లో చనిపోయారు. అనారోగ్యం కారణంగా యాంగ్‌ హోను అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు మాత్రమే ఉత్తరకొరియా ప్రకటించింది. అయితే అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో ప్రతిఘటించిన హో సైనిక బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో చనిపోయారని వార్తలు వచ్చాయి.

జనరల్‌ పియాన్‌ ఇన్‌ సన్‌ (ఆర్మీ ఆపరేషన్స్‌ హెడ్‌): తన అభిప్రాయాలతో విబేధించినందుకు ఈయన్ను కాల్చి చంపారు.


ఇవి కాకుండా దక్షిణ కొరియా టీవీ సీరియల్స్‌ను చూశారని, ఇతరత్రా చిన్నచిన్న కారణాలతో కిమ్‌ జాంగ్‌ ఉన్‌ 100 మందికి పైగా సైనిక సిబ్బందిని (ఇందులో వివిధ హోదాలో ఉన్న వారు ఉన్నారు) చంపేశారని దక్షిణకొరియా నిఘావర్గాల అంచనా. వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించినపుడు అక్కడ సాకుతున్న తాబేళ్లు ఎందుకు చనిపోతున్నాయని ఉన్‌ ప్రశ్నించగా పాపం అక్కడి కేర్‌టేకర్‌ సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అంతే అతని ప్రాణాలు పోయాయి. ఉన్హాసు ఆర్కెస్ట్రాలోని నలుగురిని పొట్టనబెట్టుకున్నాడు. వాళ్లు చేసుకున్న పాపమేమిటంటే... ఉన్‌ భార్య రి సోజుకు ఒకప్పుడు కోలిగ్స్‌ కావడమే.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement