
సాలీడును చంపబోయి కటకటాలపాలు!
వాషింగ్టన్: సాలెపురుగును చంపబోయి అమెరికాలో ఓ అమ్మడు కటకటాలపాలైంది! సాలీడును చంపితే అరెస్టు చేయాలంటూ అమెరికాలో చట్టాలేమీ లేవుగానీ.. ఎలుక కోసం ఇంటికి నిప్పుపెట్టినట్టుగా కాన్సాస్‌లోని హచిన్సన్‌కు చెందిన గిన్నీ ఎం.గ్రిఫిత్ అనే 34 ఏళ్ల మహిళ కూడా దాదాపుగా ఇంటికి నిప్పుపెట్టినంత పనిచేసింది. ఇంట్లో ఉన్న టవల్స్‌ను పోగేసి వాటికి నిప్పుపెట్టి ఆ మంటతో సాలీడును హతమార్చేందుకు ప్రయత్నించింది.
అయితే.. మంటలు ఇంట్లో సగం వరకూ వ్యాపించాయి. మంటల సంగతి తెలిసి వెంటనే ఉరుకులు పరుగుల మీద వచ్చిన అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పేశారు. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. తీరా సాలీడును చంపేందుకే తాను నిప్పుపెట్టానని చెప్పినా.. ప్రమాదకర స్థాయిలో గృహదహనానికి కారణమైందన్న అభియోగం కింద ఆమెను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారని స్థానిక మీడియా పేర్కొంది.