‘గాఢ నిద్రలో ఉన్నాం.. విమానాల్లోంచి పడ్డాయి’
డెమాస్కస్: సిరియాలో జరిగిన ఘోర రసాయన వాయువుల దాడిపట్ల అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు 70మంది మృత్యువాతకు కారణమైన ఈ ఘటనకు స్పందించి పలువురు తమ అనుభవాన్ని గుర్తు చేసుకోని బెంబేలెత్తిపోతున్నారు. దాడులు జరిగిన సమయంలో తామంతా గాఢ నిద్రలో ఉన్నట్లు చెప్పారు. కెమికల్ గ్యాస్ బాంబులన్నీ కూడా విమానాల్లో నుంచి పడ్డాయని అంటున్నారు.
సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌పై యుద్ధ విమానాలు రసాయన విష వాయువుల బాంబులను ప్రయోగించాయి. ఈ కారణంగా దాదాపు 70మంది ప్రాణాలుకోల్పోయారు. వీరిలో చిన్నారులే అధికంగా ఉన్నారు. ఈ ఘటనపై మొత్తం అగ్ర దేశాలన్నీ కూడా మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన అబ్దుల్ హమీద్ యూసఫ్ అనే వ్యక్తి తన అనుభవాన్ని తెలిపాడు.
‘ఆ సమయంలో నేను గాఢ నిద్రలో ఉన్నాను. శ్వాస తీసుకునేందుకు చాలా ఇబ్బందిగా అనిపించి మెలకువ వచ్చింది. కంగారుతో నా తొమ్మిది నెలల చిన్నారులను తీసుకెళ్లి నా భార్యకిచ్చాను. వారిని అక్కడే ఉండమని చెప్పి మా అమ్మనాన్న వద్దకెళ్లి చూశాను. ఆ సమయంలో గ్యాస్ బాంబులన్నీ విమానాల్లో నుంచి పడుతున్నాయి. ఆ వాయువులు పీల్చినవారు, రసాయనాలు మీదపడినవారు ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోతున్నారు. వీధులన్నింటిలో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. దీంతో నా కుటుంబాన్ని తీసుకొని నేను కొంచెం దూరంగా పరుగెత్తి ప్రాణాలతో బయటపడ్డాను’ అని చెప్పుకున్నాడు.