Chemical attack
-
'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు?
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఉన్న బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి, హత్నూర, బొంతపల్లి, పటాన్చెరు, పాశమైలారం ప్రాంతాల్లో 5 వేల వరకు వివిధ రకాల పరిశ్రమలున్నాయి. అందులో ఎక్కువగా రసాయన పరిశ్రమలు అధికం. ఇటీవల కొన్ని వాటిల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అమాయకులైన కార్మికులు మృత్యువాత పడ్డారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించటం లేదు. రెండేళ్లలో జరిగిన ప్రమాద వివరాలు.. ► పటాన్చెరు పారిశ్రామిక వాడలో 28 ప్రమాదాలు జరిగి 12 మంది మృతిచెందారు. 70 మంది క్షతగాత్రులయ్యారు. ► బొల్లారం పారిశ్రామికవాడలో 13 ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మరణించగా 40 మంది గాయపడ్డారు. ► బొంతపల్లిలో ఐదు ప్రమాదాలు చోటుచేసుకొని ఇద్దరు చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ► గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఐదు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మరో 16 మంది కార్మికులు గాయపడ్డారు. ► హత్నూర పారిశ్రామికవాడలో ఐదు ప్రమా దాలు జరగగా ఇద్దరు మరణించారు. 20 మంది కార్మికులు గాయపడ్డారు. పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు.. కార్మిక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. ఇందులో పనిచేస్తున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. వారి ప్రాణాలను హరించి వేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతానికి వలసొచ్చి నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కార్మిక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజా ఘటనలు.. ► ఇటీవల బొల్లారంలోని అమరా ల్యాబ్స్ పరిశ్రమలో రియాక్టర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా ఒక కార్మికుడు మృతిచెందాడు. ► తాజాగా హైగ్రోస్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారని తోటి కార్మికులు చెప్పారు. ► ఏడాది కాలంలో ఖైతాన్, వింధ్యా కెమికల్స్, మైలాన్, లీఫార్మా, శ్రీకర ల్యాబ్స్ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో కార్మికులు తీవ్రంగా గాయపడటంతోపాటు మరికొంత మంది కార్మికులు మృతిచెందారు. ఎందుకీ ప్రమాదాలు? రసాయన పరిశ్రమల్లో ఎక్కువగా మండే స్వభావం గల రసాయనాలను వినియోగిస్తుంటారు. రియాక్టర్లో రసాయనాలను కలిపే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా రియాక్టర్ పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రమ్ముల్లో నుంచి రసాయనాలను వేరు చేసే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు యాజమాన్యం నైపుణ్యం ఉన్న ఉద్యోగులతో పనులు చేయించాల్సి ఉంటుంది. రియాక్టర్లలో ఒత్తిడి నియంత్రణకు నూతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏర్పాటు చేయటంతో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ విషయంలో అవి నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల శాఖ అధికారులు సైతం ప్రమాదాల నివారణ కోసం దృష్టి సారించటం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు! నిబంధనలు పాటించని పరిశ్రమలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యాలకు అవగహన కల్పిస్తున్నాం. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వంటి సంస్థలకు నోటీసులు అందిస్తున్నాం. – శ్రీనివాస్‌రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇవి చదవండి: రాజీపడుతున్నట్లు నమ్మించి.. మద్యం తాగించి.. యువకుడిని దారుణంగా.. -
వలస కార్మికులపై బ్లీచ్ స్ప్రే
లక్నో/బరేలీ: లాక్డౌన్ కారణంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కార్మికులపై ప్రభుత్వయంత్రాంగాల నిర్లక్ష్య ధోరణికి తాజా ఉదాహరణ ఇది. భార్యాపిల్లలతో కలిసి వందలాది కిలోమీటర్లు కాలినడకన వస్తున్న బడుగు జీవులపై పారిశుధ్య సిబ్బంది కనికరం లేకుండా క్లోరిన్ నీటిని స్ప్రే చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీ, నోయిడాల్లో పనులు చేసుకునే షాజహాన్‌పూర్ తదితర ప్రాంతాలకు చెందిన 50 మంది వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా కుటుంబాలతోపాటు కాలినడకన సొంతూళ్లకు బయలుదేరారు. సోమవారం ఉదయం బరేలీ బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కొందరు మున్సిపల్ సిబ్బంది వారి వద్దకు వచ్చారు. కరోనా వైరస్‌ను చంపే మందు స్ప్రే చేస్తామని, ఆ తర్వాత భోజనం పెట్టి, సొంతూళ్లకు బస్సుల్లో తీసుకెళతామని నమ్మ బలికారు. అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి బ్లీచింగ్ నీటిని వారిపైకి నిలువెల్లా తడిచిపోయేలా స్ప్రే చేశారు. దీంతో చిన్నారులు కళ్ల మంటలతో రోదించగా, పురుషులు, మహిళలు ఒళ్లంతా దురదతో ఇబ్బందిపడ్డారు. తడి దుస్తులతోనే వారంతా తిరిగి కాలినడక సాగించారు. కాగా, బడుగు జీవుల పట్ల మున్సిపల్ సిబ్బంది చూపిన కాఠిన్యంపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ‘వలస కార్మికులపై రసాయనాలు స్ప్రే చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిందా? కార్మికులు పడిన యాతనలకు ఏం చికిత్స చేయించారు? స్ప్రే కారణంగా దుస్తులు తడిచిన వారికి ఏర్పాట్లు చేశారా? పాడైపోయిన వారి ఆహార పదార్థాలకు బదులుగా ఏం సమకూర్చారు?’అంటూ ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారంపై జిల్లా మేజిస్ట్రేట్ నితీశ్‡ స్పందించారు. స్థానిక సిబ్బంది చేసింది తప్పేనని ఒప్పుకున్నారు. ‘వలస కార్మికులు ప్రయాణించే బస్సులను శానిటైజ్ చేయాలని మాత్రమే ఆదేశించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం బాధితులకు అవసరమైన వైద్యం చేయిస్తాం’ అని వివరణ ఇచ్చారు. కాగా, లాండ్రీల్లో వాడే బ్లీచ్‌లో సోడియం హైపోక్లోరైట్ ఉంటుంది. దీనిని క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు. -
ఆగని అఘాయిత్యాలు, మహిళపై కెమికల్ దాడి
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లో దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్ అనంతరం మహిళలపై హింసాత్మక దాడులు కాస్తయినా చల్లారుతాయని భావిస్తున్న తరుణంలో దేశ రాజధాని నడిబొడ్డున మరో అమానుషం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న మహిళలపై అత్యాచారాలు, హింస ఘటనలపై తీవ్ర చర్చ నడుస్తుండగానే ఢిల్లీ రేల్వే స్టేషన్‌ని సమీపంలోని అజ్మేరీ గేట్ వద్ద శనివారం ఒక మహిళపై కెమికల్ దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగుడు ఆమెపై కెమికల్ చల్లి పారిపోయాడు. ఈ దాడి ఎవరు చేసారు, ఎందుకు చేశారో ఇంకా తెలియరాలేదు. మహిళను ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బాధితురాలిని కావేరి (30) గా గుర్తించారు. ఈ ఘటపై మర్చి వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు డిల్లీలోని ఆసుపత్రిలో 48 గంటలుపాటు మృత్యువు పోరాడిన ఉన్నావ్ అత్యాచార బాధిరాలు తనువు చాలించడం ఆందోళనకు దారితీసింది. ఉత్తరప్రదేశ్, ఉన్నావ్ అత్యాచార బాధితురాలు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరవుతున్న క్రమంలో బెయిల్ విడుదలపైన నిందితుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. తనపై జరిగిన లైంగిక దాడికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న ఆమె, మరోసారి దాడి జరిగినా ధైర్యాన్ని కోల్పోలేదు. అగ్నికీలల్లో కాలిపోతూ, సహాయం అర్థిస్తూ కిలోమీటరు దూరం పరుగెత్తింది. స్వయంగా తానే పోలీసులకు ఫోన్ చేసింది. తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న ఆమెను మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని ఆసుపత్రికి తరించినా ఫలితం లేకపోయింది. ఎలాగైన కాపాడాలని వైద్యులను కోరుతూ, నిందితుడికి శిక్షపడాలని ఆరాటపడుతూనే ఈ మృగాళ్ల రాజ్యంనుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది. -
ప్రాంక్ కాల్.. ఆపై కటకటాల పాలు..
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీపై దాడులు జరుగుతాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ప్రాంక్ కాల్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ముంబై పోలీసులు సోమవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన 22 ఏళ్ల కాశీనాథ్ మండల్ ముంబైలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్ సేకరించాడు. ఆపై ఎన్ఎస్జీ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ప్రధాని మోదీపై దాడి జరుగుతుందని సమాచారం ఇచ్చాడు. కెమికల్ దాడి జరిగే అవకాశం ఉందని, తన వద్ద సమాచారం ఉందని ఎన్ఎస్జీని నమ్మించాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా కాశీనాథ్‌ను సెంట్రల్ ముంబైలోని డీబీ మార్గ్ పోలీసులు జూలై 27న అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌కు వెళ్లే రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నరేంద్ర మోదీని కలుసుకోవడమే తన ఉద్దేశమని కాశీనాథ్ విచారణలో వెల్లడించాడు. ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో తన స్నేహితుడు చనిపోయాడని.. ఈ విషయంపై ప్రధాని మోదీని కలుసుకుని మాట్లాడాలని భావించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. -
సిరియాలో మరో ఘోరం..
డమస్కస్: యుద్ధ బాధిత దేశమైన సిరియాలో మరో ఘోరం చోటుచేసుకుంది. సిరియా రాజధాని డమస్కస్‌కు సమీపంలోని డౌమా పట్టణంలో జరిగిన విష రసాయనిక దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు, పిల్లలు ప్రాణాలు విడిచారు. శనివారం సాయంత్రం ప్రభుత్వ సైనికులు ఈ దాడి జరిపినట్టు తెలుస్తోంది. ఇది విషపూరితమైన గ్యాస్ (టాక్సిక్ గ్యాస్) దాడి అని స్థానిక వైద్యులు వెల్లడించారు. ఈ విషపూరిత గ్యాస్ దాడిలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 42మంది చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. ఆర్గాన్ ఫాస్ఫోరస్ సమ్మేళనంతో ఈ దాడి జరిగిందని, ఈ ప్రభావంతో వేలమందికి శరీరాలపై తీవ్ర గాయాలయ్యాయని సహాయక సిబ్బంది చెప్తున్నారు. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న తూర్పు ఘౌటా ప్రాంతంపై అధ్యక్షుడు అసద్ సైన్యం రసాయనిక దాడి జరపడం ఇదే తొలిసారి కాదు. ప్రభుత్వ సైనిక ముట్టడిలో ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల క్లోరైన్ రసాయనిక దాడులు జరిగాయి. 2013లో సరిన్ గ్యాస్ దాడి జరిగింది. ప్రభుత్వ సైన్యం విచ్చలవిడిగా జరుపుతున్న వైమానిక దాడులు, రసాయనిక దాడులతో బెంబేలెత్తుతున్న ప్రజలు, కొందరు తిరుగుబాటుశ్రేణులు కూడా ఆ ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో వలస వెళ్లిపోతున్నారు. డౌమా: గ్యాస్ దాడికి గురైన చిన్నారులు ఘౌటా ప్రాంతంలోని డౌమా పట్టణంలో ఉన్న షెల్టర్ల వద్ద తాజా దాడి జరిగిందని, బాంబు దాడులు జరిగినా సురక్షితంగా ఉండేందుకు ఉద్దేశించిన ప్రాంతాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి.. బెదరగొట్టేందుకు ఈ గ్యాస్ దాడి జరిగి ఉంటుందని, క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందిస్తున్న స్థానిక డాక్టర్లు చెప్తున్నారు. ఈ రసాయనిక దాడిలో పెద్దసంఖ్యలో చిన్నారులు, కుటుంబాలు మృతిచెందినట్టు వీడియోలు వెలుగుచూస్తున్నాయి. దట్టమైన గ్యాస్ దాడి వల్ల చిన్నారులు ఊపిరి ఆడక నరకం అనుభవించడం, వారికి సహాయక సిబ్బంది ఇన్హేలర్లతో స్వాంతన చేకూర్చడం, గ్యాస్ దాడి బారిన పడిన వారికి ఆక్సీజన్ అందించడం వంటి హృదయవిదాకరమైన వీడియోలు, ఫొటోలు వెలుగుచూశాయి. డౌమా: గ్యాస్ దాడికి గురై.. ఆక్సిజన్ పొందుతున్న వ్యక్తి.. అమెరికా ఆగ్రహం! రెబల్స్ అధీనంలోని డౌమా పట్టణంపై రసాయనిక దాడి జరిగిన నేపథ్యంలో సిరియా, రష్యా ప్రభుత్వాలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసద్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నందుకు ఈ దాడికి రష్యానే బాధ్యత వహించాలని ఘాటుగా పేర్కొంది. డౌమాలోని ఆస్పత్రిపై కూడా రసాయనిక దాడి జరిగిందన్న వార్తలు తమను కలిచి వేస్తున్నాయని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి హిథర్ నౌవెర్ట్ అన్నారు. అసద్ ప్రభుత్వానికి, ఘౌటాను తమ అధీనంలో ఉంచుకున్న తిరుగుబాటుదారులకు రాజీ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఆదివారం ఉదయం ఈ ప్రాంతంపై మళ్లీ ప్రభుత్వ సేనలు వైమానిక దాడులు ప్రారంభించాయి. మరోవైపు డౌమా పట్టణంలో రసాయనిక దాడి జరగలేదని సిరియా ప్రభుత్వ మీడియా, రష్యా చెప్పుకొచ్చాయి. వైమానిక దాడులు కొనసాగుతున్నప్పటికీ ఘౌటాలోని రెబల్ సంస్థ జైష్ అల్ ఇస్లాం సంస్థతో శాంతి చర్చలు ఆదివారం జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. డౌమా: గ్యాస్ దాడికి గురైన చిన్నారులు -
మరో ఎటాక్‌కు ప్లాన్: అగ్రరాజ్యం సీరియస్
రసాయనిక దాడులతో సిరియాను రక్తసిక్తం చేస్తున్నారు. మరోమారు మరో ఘోర రసానియ దాడికి సిరియన్ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ సిద్ధమవుతున్నట్టు వైట్ హౌజ్ పేర్కొంది. ఒకవేళ ఆయన ఈ దాడికి పాల్పడితే భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. సోమవారం రాత్రి విడుదల చేసిన వైట్ హౌజ్ ప్రకటనలో సిరియా అధ్యక్షుడికి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్ లో రసాయనిక దాడికి పాల్పడే ముందు చేపట్టిన సన్నాహాలు మాదిరే, సిరియాలో ప్రస్తుతం మరో కెమికల్ దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించినట్టు వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ చెప్పారు. అసద్ పరిపాలనలో మరో భారీ రసాయనిక వాయువుల దాడి జరుగబోతుందని, ఇది భారీ మొత్తంలో ప్రజలను బలితీసుకోనుందని తెలిపారు. ఇదే రకమైన కార్యకలాపాలు 2017 ఏప్రిల్ 4 కు ముందు కూడా చేపట్టారని పేర్కొన్నారు. ఒకవేళ రసాయనిక ఆయుధాలతో ప్రజల ప్రాణాలను బలిగొనే ఎటాక్ ను చేపడితే, ఆయన, ఆయన సైన్యం భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పైసర్ హెచ్చరించారు. ఏప్రిల్ లో జరిగిన ఎటాక్ కు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ గా స్పందించారు. వెంటనే అసల్ కంట్రోల్ లో ఉన్న ఎయిర్ ఫీల్డ్ పై దాడులు చేపట్టారు. ఏప్రిల్ లో జరిగిన రసాయనిక దాడిలో ముక్కుపచ్చరాలని పసిపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఎక్కువగా ఏ పాపం తెలియని చిన్నారులే ఉన్నారు. -
రసాయనదాడి.. ఓ కట్టుకథ: అసద్
తమ మీద క్షిపణులతో దాడి చేయడానికి అమెరికా ’రసాయన దాడి’ అనే కట్టుకథను ఉపయోగించుకుందని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తీవ్రంగా మండిపడ్డారు. నూటికి నూరుశాతం.. కచ్చితంగా అది కట్టుకథేనని, కేవలం తమ దేశం మీద దాడి చేయడం కోసం అమెరికా ఈ మొత్తం కథను అల్లేసిందని ఆయన అన్నారు. రసాయన ఆయుధాలన్నింటినీ సిరియా సైన్యం ఎప్పుడో విడిచిపెట్టేసిందని చెబుతూ.. అమెరికా దాడి చేసినంత మాత్రాన తమ సైనిక సామర్థ్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు. సిరియా సైన్యం చేసిందని చెబుతున్న రసాయన దాడిలో ఇప్పటివరకు 87 మంది మరణించారు. వాళ్లలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఈ దాడిలో మృతుల, క్షతగాత్రుల ఫొటోలు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయితే సిరియా మాత్రం అసలు తాము ఈ తరహా దాడులే చేయలేదని చెబుతుండగా రష్యా కూడా దాన్ని సమర్థించింది. తిరుగుబాటుదారుల వద్ద విషపూరిత పదార్థాలతో కూడిన డిపో ఒకటి ఉందని, దానిమీద సిరియా వైమానిక దళం బాంబులు వేయడంతో దాన్నుంచి విషవాయువులు బయటకు వచ్చి ఉంటాయన్నది సిరియా, రష్యా వర్గాల వాదన. అసలు ఖాన్ షైఖుమ్ ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్న దాడుల మీద కూడా అసద్ అనుమానం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న వీడియోలలో వాస్తవం ఎంతో తెలియదన్నారు. ఆ పిల్లలు నిజంగా ఖాన్ షైఖుమ్ ప్రాంతంవారో కాదో ఎలా చెప్పగలమని, ఇప్పుడు చాలా వరకు ఫేక్ వీడియోలు ఉంటున్నాయని అన్నారు. రసాయన దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య సిరియాలోని ఒక వైమానిక స్థావరంపై మధ్యధరా సముద్రం నుంచి 59 తోమహాక్ క్షిపణులు ప్రయోగింపజేసిన విషయం తెలిసిందే. సిరియాలో ఆరేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుని ప్రత్యక్ష దాడికి దిగడం ఇదే మొదటిసారి. -
‘గాఢ నిద్రలో ఉన్నాం.. విమానాల్లోంచి పడ్డాయి’
-
‘గాఢ నిద్రలో ఉన్నాం.. విమానాల్లోంచి పడ్డాయి’
డెమాస్కస్: సిరియాలో జరిగిన ఘోర రసాయన వాయువుల దాడిపట్ల అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు 70మంది మృత్యువాతకు కారణమైన ఈ ఘటనకు స్పందించి పలువురు తమ అనుభవాన్ని గుర్తు చేసుకోని బెంబేలెత్తిపోతున్నారు. దాడులు జరిగిన సమయంలో తామంతా గాఢ నిద్రలో ఉన్నట్లు చెప్పారు. కెమికల్ గ్యాస్ బాంబులన్నీ కూడా విమానాల్లో నుంచి పడ్డాయని అంటున్నారు. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌పై యుద్ధ విమానాలు రసాయన విష వాయువుల బాంబులను ప్రయోగించాయి. ఈ కారణంగా దాదాపు 70మంది ప్రాణాలుకోల్పోయారు. వీరిలో చిన్నారులే అధికంగా ఉన్నారు. ఈ ఘటనపై మొత్తం అగ్ర దేశాలన్నీ కూడా మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన అబ్దుల్ హమీద్ యూసఫ్ అనే వ్యక్తి తన అనుభవాన్ని తెలిపాడు. ‘ఆ సమయంలో నేను గాఢ నిద్రలో ఉన్నాను. శ్వాస తీసుకునేందుకు చాలా ఇబ్బందిగా అనిపించి మెలకువ వచ్చింది. కంగారుతో నా తొమ్మిది నెలల చిన్నారులను తీసుకెళ్లి నా భార్యకిచ్చాను. వారిని అక్కడే ఉండమని చెప్పి మా అమ్మనాన్న వద్దకెళ్లి చూశాను. ఆ సమయంలో గ్యాస్ బాంబులన్నీ విమానాల్లో నుంచి పడుతున్నాయి. ఆ వాయువులు పీల్చినవారు, రసాయనాలు మీదపడినవారు ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోతున్నారు. వీధులన్నింటిలో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. దీంతో నా కుటుంబాన్ని తీసుకొని నేను కొంచెం దూరంగా పరుగెత్తి ప్రాణాలతో బయటపడ్డాను’ అని చెప్పుకున్నాడు. -
సిరియాలో నరమేధం
-
ఒబామా, బషర్‌పై ట్రంప్ ఫైర్
బీరుట్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిరియాలో విషవాయువుల దాడికి వారిద్దరే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013లోనే ఇలాంటి దాడి జరిగినా ఒబామా ఉదాసీనంగా వ్యవహరించారని, అప్పుడే కఠినమైన చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అన్నారు. యుద్దవిమానాలు విష రసాయనాల దాడిలో వాయువ్య సిరియాలో 58 మంది అమాయకులు ప్రాణాలుకోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. రెబెల్స్ ఆధీనంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ పరిధిలోగల ఖాన్ షేఖున్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడులకు పాల్పడింది సిరియా యుద్ధ విమానాలా? లేక రష్యాకు చెందినవా? అనేది తెలియరాలేదు. దీనిపై ఐక్యరాజ్యసమితితోపాటు ట్రంప్ కూడా స్పందించారు. సిరియానే ఈ దాడులకు అసలు కారణం అని వారికి అండగా ఉంటూ దాడులు చేస్తున్న రష్యా, ఇరాన్ కూడా ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది అత్యంత క్రూరమైన చర్య అని, పౌర సమాజం దీనిని విస్మరించబోరాదని చెప్పారు. 2013లో ఈ తరహా దాడి జరిగిన సమయంలో మాజీ అధ్యక్షుడు ఒబామా బలహీనంగా వ్యవహరించారని ఆరోపించారు. బషర్ పరిపాలన వర్గం బలహీనత, పరిష్కార లేమితత్వం కూడా మరో కారణం అని ఆరోపించారు. -
సిరియాలో నరమేధం
- రసాయన దాడికి 58 మంది బలి - మృతుల్లో 11 మంది చిన్నారులు - ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి.. వాంతులు, ఇతర సమస్యలతో నరకయాతన బీరుట్: యుద్దవిమానాలు విష రసాయనాలతో వాయువ్య సిరియాపై జరిపిన దాడి 58 మంది అమాయకుల ప్రాణాలను బలిగొంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. రెబెల్స్ ఆధీనంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ పరిధిలోగల ఖాన్ షేఖున్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. విషవాయువు ప్రభావానికి లోనైన అనేకమంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని సిరియాలోని మానవ హక్కుల సంస్థ పేర్కొంది. వీరి సంఖ్య దాదాపు 200 వరకూ ఉండొచ్చని తెలిపింది. అంతేకాకుండా స్పృహకోల్పోవడం, వాంతులు, నోటి నుంచి నురుగు రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. యుద్ధవిమానాలు విడిచిపెట్టిన వాయువు స్వభావాన్ని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ నిర్ధారించలేకపోయింది. ఈ దాడులకు పాల్పడింది సిరియా యుద్ధ విమానాలా? లేక రష్యాకు చెందినవా? అనేది తెలియరాలేదు. సిరియా భవితవ్యంపై బ్రసెల్స్ కేంద్రంగా రెండు రోజుల క్రితం యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి చర్చలు ప్రారంభించిన నేపథ్యంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. బాధితుల్లో అత్యధిక శాతం మంది పౌరులేనని, మృతుల్లో 11 మంది చిన్నారులు కూడా ఉన్నారని సిరియాలోని మానవ హక్కుల సంస్థ తెలిపింది. విషవాయువు దాడి అనంతరం రంగంలోకి దిగిన వలంటీర్లు బాధితులకు తమవంతు సేవలందించారు. ఇడ్లిబ్ ప్రావిన్స్ అల్‌కాయిదా అనుబంధ ఫతే అల్ షామ్ ఫ్రంట్ సంస్థ ఆధీనంలో ఉంది. అమెరికా సైనిక చర్య నుంచి బయటపడేందుకుగాను సిరియా ప్రభుత్వం 2013లో రసాయన ఆయుధాల నిషేధ ఒప్పందంపై సంతకం చేసింది. అయితే సంతకం చేసినప్పటికీ అనధికారికంగా రసాయన ఆయుధాలను సిరియా ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. 2014,15లలో కనీసం మూడు పర్యాయాలు క్లోరిన్ రసాయనంతో రెబెల్ ఆధీనంలోని ప్రాంతాలపై సిరియా ప్రభుత్వం దాడి చేసినట్టు ఐక్యరాజ్యసమితి జరిపిన విచారణలో తేలింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ విధేయ సైనిక బలగాలు హమా ప్రావిన్స్‌పై రసాయన ఆయుధాలతో గత గురువారం దాడి జరిపాయి. ఈ దాడిలో ఎవరూ చనిపోకపోయినప్పటికీ రసాయనాల ప్రభావం కారణంగా హమా ప్రావిన్స్ వాసులు శ్వాసకోశ సమస్యలతో విలవిలలాడారు. పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. అటువంటిదేమీ లేదు రెబెల్ ఆధీనంలోని ప్రాంతాలపై రసాయనాలు, విషవాయువులతో దాడి చేసినట్టు వచ్చిన ఆరోపణలను సిరియా సైన్యం తోసిపుచ్చింది. అటువంటి ఆయుధాలు ఎప్పుడూ తమ వద్ద లేవని పేర్కొంది. ఇది బషర్ పనే: విపక్షం బషర్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఖాన్ షేఖున్ ప్రాంతంపై విషవాయువుతో దాడికి పాల్పడిందని ప్రతిపక్షం ఆరోపించింది. దీనిపై ఐరాస భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసింది. దాడి కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మాకేం సంబంధం లేదు: రష్యా మాస్కో: సిరియాలోని ఖాన్ షేఖున్ ప్రాంతంపై తమ విమానాలు ఎటువంటి దాడులు చేయలేదని రష్యా తేల్చిచెప్పింది. ‘ఇడ్లిబ్ ప్రావిన్స్‌పై మా యుద్ధవిమానాలు దాడులు చేయలేదు’ అని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. రసాయన దాడి బాధితులకు చికిత్స చేస్తున్న ఆస్పత్రిపైనే ఈ దాడి జరగడం గమనార్హం. -
మహిళలపై గృహహింస దాడులే అధికం
రసాయన ప్రమాదాలకు గురైన మహిళలకు ఉచితంగా సర్జరీ చేయాలి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ మెక్ అలిస్టర్ సాక్షి, హైదరాబాద్: రసాయన దాడికి గురైన ప్రతి బాధితురాలికి న్యాయం జరగాలని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ మెక్ అలిస్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రసాయన ప్రమాదాల్లో వేధింపులు, గృహహింసకు సంబంధించిన వే ఎక్కువని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలకు గురైన మహిళలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ప్రత్యేక కేటగిరీగా పరిగణించి ఉచితంగా సర్జరీలు చేయాలని కోరారు. నేర నివారణ, బాధితుల సంరక్షణపై చెన్నై కేంద్రంగా కొనసాగుతున్న పీసీవీసీ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసిడ్ దాడులు, కిరోసిన్, గ్యాస్ పేలుళ్లకు గురైన మహిళలను సంరక్షించేందుకు పనిచేస్తున్న సంస్థలకు బ్రిటిష్ కమిషన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఇలాంటి ప్రమాదాల విషయంలో తక్షణ సమాచారంతో పాటు మరణ వాంగ్మూలం కీలకమని, వీటి ఆధారంగా బాధితులకు న్యాయం జరిగేందుకు కృషి చేయొచ్చన్నారు. న్యాయ సేవల విభాగం ఆస్పత్రులతో సమన్వయం చేసుకుని బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూడాలన్నారు. అనంతరం పీసీవీసీ సీఈఓ ప్రసన్న మాట్లాడుతూ రసాయన దాడులు, అగ్ని ప్రమాదాల బారిన పడ్డ మహిళలు మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతారని, వారికి ఓదార్పు అవసరమన్నారు. ఇందులో భాగంగా తమ సంస్థ పనిచేస్తుందని.. చైన్నైలో దాదాపు 150 మందిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు.