రసాయనదాడి.. ఓ కట్టుకథ: అసద్
తమ మీద క్షిపణులతో దాడి చేయడానికి అమెరికా ’రసాయన దాడి’ అనే కట్టుకథను ఉపయోగించుకుందని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తీవ్రంగా మండిపడ్డారు. నూటికి నూరుశాతం.. కచ్చితంగా అది కట్టుకథేనని, కేవలం తమ దేశం మీద దాడి చేయడం కోసం అమెరికా ఈ మొత్తం కథను అల్లేసిందని ఆయన అన్నారు. రసాయన ఆయుధాలన్నింటినీ సిరియా సైన్యం ఎప్పుడో విడిచిపెట్టేసిందని చెబుతూ.. అమెరికా దాడి చేసినంత మాత్రాన తమ సైనిక సామర్థ్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు. సిరియా సైన్యం చేసిందని చెబుతున్న రసాయన దాడిలో ఇప్పటివరకు 87 మంది మరణించారు. వాళ్లలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఈ దాడిలో మృతుల, క్షతగాత్రుల ఫొటోలు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
అయితే సిరియా మాత్రం అసలు తాము ఈ తరహా దాడులే చేయలేదని చెబుతుండగా రష్యా కూడా దాన్ని సమర్థించింది. తిరుగుబాటుదారుల వద్ద విషపూరిత పదార్థాలతో కూడిన డిపో ఒకటి ఉందని, దానిమీద సిరియా వైమానిక దళం బాంబులు వేయడంతో దాన్నుంచి విషవాయువులు బయటకు వచ్చి ఉంటాయన్నది సిరియా, రష్యా వర్గాల వాదన. అసలు ఖాన్ షైఖుమ్ ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్న దాడుల మీద కూడా అసద్ అనుమానం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న వీడియోలలో వాస్తవం ఎంతో తెలియదన్నారు. ఆ పిల్లలు నిజంగా ఖాన్ షైఖుమ్ ప్రాంతంవారో కాదో ఎలా చెప్పగలమని, ఇప్పుడు చాలా వరకు ఫేక్ వీడియోలు ఉంటున్నాయని అన్నారు.
రసాయన దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య సిరియాలోని ఒక వైమానిక స్థావరంపై మధ్యధరా సముద్రం నుంచి 59 తోమహాక్ క్షిపణులు ప్రయోగింపజేసిన విషయం తెలిసిందే. సిరియాలో ఆరేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుని ప్రత్యక్ష దాడికి దిగడం ఇదే మొదటిసారి.