ఒబామా, బషర్‌పై ట్రంప్ ఫైర్
బీరుట్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిరియాలో విషవాయువుల దాడికి వారిద్దరే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013లోనే ఇలాంటి దాడి జరిగినా ఒబామా ఉదాసీనంగా వ్యవహరించారని, అప్పుడే కఠినమైన చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అన్నారు. యుద్దవిమానాలు విష రసాయనాల దాడిలో వాయువ్య సిరియాలో 58 మంది అమాయకులు ప్రాణాలుకోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.
రెబెల్స్ ఆధీనంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ పరిధిలోగల ఖాన్ షేఖున్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడులకు పాల్పడింది సిరియా యుద్ధ విమానాలా? లేక రష్యాకు చెందినవా? అనేది తెలియరాలేదు. దీనిపై ఐక్యరాజ్యసమితితోపాటు ట్రంప్ కూడా స్పందించారు. సిరియానే ఈ దాడులకు అసలు కారణం అని వారికి అండగా ఉంటూ దాడులు చేస్తున్న రష్యా, ఇరాన్ కూడా ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది అత్యంత క్రూరమైన చర్య అని, పౌర సమాజం దీనిని విస్మరించబోరాదని చెప్పారు. 2013లో ఈ తరహా దాడి జరిగిన సమయంలో మాజీ అధ్యక్షుడు ఒబామా బలహీనంగా వ్యవహరించారని ఆరోపించారు. బషర్ పరిపాలన వర్గం బలహీనత, పరిష్కార లేమితత్వం కూడా మరో కారణం అని ఆరోపించారు.