సిరియాలో నరమేధం
- రసాయన దాడికి 58 మంది బలి
- మృతుల్లో 11 మంది చిన్నారులు
- ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి.. వాంతులు, ఇతర సమస్యలతో నరకయాతన
బీరుట్: యుద్దవిమానాలు విష రసాయనాలతో వాయువ్య సిరియాపై జరిపిన దాడి 58 మంది అమాయకుల ప్రాణాలను బలిగొంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. రెబెల్స్ ఆధీనంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ పరిధిలోగల ఖాన్ షేఖున్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. విషవాయువు ప్రభావానికి లోనైన అనేకమంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని సిరియాలోని మానవ హక్కుల సంస్థ పేర్కొంది. వీరి సంఖ్య దాదాపు 200 వరకూ ఉండొచ్చని తెలిపింది. అంతేకాకుండా స్పృహకోల్పోవడం, వాంతులు, నోటి నుంచి నురుగు రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. యుద్ధవిమానాలు విడిచిపెట్టిన వాయువు స్వభావాన్ని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ నిర్ధారించలేకపోయింది. ఈ దాడులకు పాల్పడింది సిరియా యుద్ధ విమానాలా? లేక రష్యాకు చెందినవా? అనేది తెలియరాలేదు.
సిరియా భవితవ్యంపై బ్రసెల్స్ కేంద్రంగా రెండు రోజుల క్రితం యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి చర్చలు ప్రారంభించిన నేపథ్యంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. బాధితుల్లో అత్యధిక శాతం మంది పౌరులేనని, మృతుల్లో 11 మంది చిన్నారులు కూడా ఉన్నారని సిరియాలోని మానవ హక్కుల సంస్థ తెలిపింది. విషవాయువు దాడి అనంతరం రంగంలోకి దిగిన వలంటీర్లు బాధితులకు తమవంతు సేవలందించారు. ఇడ్లిబ్ ప్రావిన్స్ అల్‌కాయిదా అనుబంధ ఫతే అల్ షామ్ ఫ్రంట్ సంస్థ ఆధీనంలో ఉంది. అమెరికా సైనిక చర్య నుంచి బయటపడేందుకుగాను సిరియా ప్రభుత్వం 2013లో రసాయన ఆయుధాల నిషేధ ఒప్పందంపై సంతకం చేసింది.
అయితే సంతకం చేసినప్పటికీ అనధికారికంగా రసాయన ఆయుధాలను సిరియా ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. 2014,15లలో కనీసం మూడు పర్యాయాలు క్లోరిన్ రసాయనంతో రెబెల్ ఆధీనంలోని ప్రాంతాలపై సిరియా ప్రభుత్వం దాడి చేసినట్టు ఐక్యరాజ్యసమితి జరిపిన విచారణలో తేలింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ విధేయ సైనిక బలగాలు హమా ప్రావిన్స్‌పై రసాయన ఆయుధాలతో గత గురువారం దాడి జరిపాయి. ఈ దాడిలో ఎవరూ చనిపోకపోయినప్పటికీ రసాయనాల ప్రభావం కారణంగా హమా ప్రావిన్స్ వాసులు శ్వాసకోశ సమస్యలతో విలవిలలాడారు. పలువురు ఆస్పత్రుల పాలయ్యారు.
అటువంటిదేమీ లేదు
రెబెల్ ఆధీనంలోని ప్రాంతాలపై రసాయనాలు, విషవాయువులతో దాడి చేసినట్టు వచ్చిన ఆరోపణలను సిరియా సైన్యం తోసిపుచ్చింది. అటువంటి ఆయుధాలు ఎప్పుడూ తమ వద్ద లేవని పేర్కొంది.
ఇది బషర్ పనే: విపక్షం
బషర్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఖాన్ షేఖున్ ప్రాంతంపై విషవాయువుతో దాడికి పాల్పడిందని ప్రతిపక్షం ఆరోపించింది. దీనిపై ఐరాస భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసింది. దాడి కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
మాకేం సంబంధం లేదు: రష్యా
మాస్కో: సిరియాలోని ఖాన్ షేఖున్ ప్రాంతంపై తమ విమానాలు ఎటువంటి దాడులు చేయలేదని రష్యా తేల్చిచెప్పింది. ‘ఇడ్లిబ్ ప్రావిన్స్‌పై మా యుద్ధవిమానాలు దాడులు చేయలేదు’ అని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. రసాయన దాడి బాధితులకు చికిత్స చేస్తున్న ఆస్పత్రిపైనే ఈ దాడి జరగడం గమనార్హం.