1989 నాటి ఘటనను గుర్తుచేసే దృశ్యాలు(కర్టెసీ: రాయిటర్స్)
తైపీ: తియానన్మెన్ స్క్వేర్ ఘటనకు సంబంధించిన నిజాలు వెల్లడించి ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని తైవాన్ చైనాను డిమాండ్ చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులు పొరబాట్లు సరిదిద్దుకునే ధైర్యం చేసి సంస్కరణలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికైనా ప్రజలకు తిరిగి అధికారం ఇవ్వాలని హితవు పలికింది. జూన్ 4 ఘటనగా చరిత్రకెక్కిన తియామెన్మెన్ స్వ్కేర్ నిరసనలు జరిగి గురువారం నాటికి 31 ఏళ్లు నిండుతున్నాయి. ఈ ఘటనలో ఎంత మంది పౌరులు మరణించారో చైనా ప్రభుత్వం నేటికీ కచ్చితమైన గణాంకాలు విడుదల చేయలేదు. మానవ హక్కుల సంఘాలు మాత్రం దాదాపు వెయ్యి మంది ఈ మారణకాండలో ప్రాణాలు కోల్పోయినట్లు వాదిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న అమాయకులను బలితీసుకున్న ఈ ఉదంతాన్ని గుర్తు చేస్తూ తైవాన్ చైనాపై బుధవారం విమర్శలు గుప్పించింది. చరిత్ర పుటల్లో మరుగున పడిన వాస్తవాలను బహిర్గతం చేసి.. చైనా భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక ఈ విషయంపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్.. తైవాన్ డిమాండ్ అర్థంపర్థం లేనిదని కొట్టిపారేశారు. ’’1980లో చెలరేగిన రాజకీయ సంక్షోభానికి చైనా విస్పష్టమైన ముగింపు పలికింది. సరికొత్త చైనా ఆవిర్భవించిన తర్వాత ఎన్నెన్నో విజయాలు అందుకున్నాం. చైనా నవనిర్మాతలు ఎంచుకున్న అభివృద్ధి పథం సరైనది. జాతీయ భద్రతా పరిస్థితుల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. తైవాన్ అధికారుల మాటలకు అసలు అర్థంలేదు’’ అని పేర్కొన్నారు.
కాగా తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి చైనా నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. స్వతంత్ర పాలనకు మొగ్గుచూపిన తైవాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసేందుకు డ్రాగన్ కుట్ర పన్నుతోందన్న తైవాన్ తాజాగా చైనా ఆధిపత్య ధోరణిని నిరసించింది. ఇక చైనా మెయిన్‌లాండ్‌లో భాగమైన తియానన్మెన్ స్క్వేర్‌లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రజస్వామ్యబద్ధంగా జరిగిన పోరాటాన్ని చైనా మాజీ ప్రధాని లీపెంగ్ అణచివేసిన విషయం తెలిసిందే. ఈ ఊచకోతలో వందలాది మంది మృత్యువాతపడ్డారు. 1989లో జరిగిన ఈ ఘటన కారణంగా చైనాపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక నిరసనల్లో భాగంగా చైనా భారీ మిలిటరీ ట్యాంకులకు ఎదురొడ్డి నిలబడిన ట్యాంక్‌మాన్‌గా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఏమయ్యాడో నేటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. తెల్ల చొక్కా వేసుకుని.. చేతిలో రెండు సంచులు పట్టుకుని ఉన్న అతడిని విదేశీ పత్రికల ఫొటోగ్రాఫర్లు కెమెరాలో బంధించినప్పటికీ అతడి గురించిన పూర్తి వివరాలు ఎవరూ తెలుసుకోలేకపోయారు. అతడిని చైనా సైన్యం చంపేసిందని కొందరు వాదిస్తుండగా.. మరికొందరు ట్యాంక్‌మాన్ ఎక్కడో ఓ చోట అజ్ఞాతజీవితం గడుపుతూ ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా తియానన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన దారుణాలపై చైనా పెదవి విప్పాలని అమెరికా సహా ఈయూ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.(హాంకాంగ్‌పై చైనా పెత్తనం.. షాకిచ్చిన ట్రంప్!)
Comments
Please login to add a commentAdd a comment