అమెరికా నుంచి తస్కరించి..
ఇతర దేశాలు, సంస్థలు, వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచే అగ్రరాజ్యం అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారానే ఈ భారీ సైబర్ దాడికి బీజం పడిందని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు, వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఎన్‌ఎస్ ఏ ఓ మాల్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఎటర్నల్ బ్లూ అని పేరు పెట్టింది. విండోస్ అపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న కొన్ని లోపాల ఆధారంగా దీన్ని తయారు చేశా రు. ‘షాడో బ్రోకర్స్’అనే హ్యాకర్ల బృందం తాము ఎన్‌ఎస్‌ఏ నుంచి ‘సైబర్ ఆయుధాల’ను దొంగిలించామని గతేడాదే ప్రకటించింది.
కానీ ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ బృందం తాము తస్కరించిన ఆయుధాలను ఏప్రిల్ 14న ఇంటర్‌నెట్‌లో డంప్ చేసింది. అందులోని ఎటర్నల్ బ్లూ మాల్‌వేర్‌నే ఇప్పుడు సైబర్ దొంగలు వనా క్రై/వనాక్రిప్టర్ పేరుతో తమ దాడులకు ఉపయోగించుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు. ‘ప్రమాదమని హెచ్చరించినా పశ్చిమదేశాల సాఫ్ట్‌వేర్ మీద దాడి చేయగల ప్రమాదకర సైబర్ ఆయుధాలను ఎన్‌ఎస్‌ఏ తయారు చేసింది.
ఎన్‌ఎస్‌ఏ తన ఆయుధాలను పోగొట్టుకున్న తర్వాత కాకుండా.. సాఫ్ట్‌వేర్‌లో లోపాన్ని మొదట గుర్తించినప్పుడే వెల్లడిస్తే ఈ దాడి జరిగేది కాదేమో’అని సైబర్ ఉద్యమకారుడు ఎడ్వర్డ్ స్నోడెన్ తప్పుపట్టారు. రెండు నెలల కింద మైక్రోసాఫ్ట్ ఈ లోపాలను సరిదిద్దుతూ అప్‌డేట్ ప్యాచ్‌లను విడుదల చేసింది. చాలామంది ఈ అప్‌డేట్‌ను తమ పీసీల్లో, నెట్‌వర్క్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోలేదు. ఇలా అప్‌డేట్ చేసుకోని కంప్యూటర్లు తాజా సైబర్ దాడి బారిన పడ్డాయని చెబుతున్నారు.