యువత ఆత్మహత్యలే టార్గెట్
సెయింట్ పీటర్స్‌బర్గ్: యువతను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తూ.. రష్యా సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు ప్రమాదకరంగా పరిణమించాయి. రష్యా ఫేస్‌బుక్‌గా పిలుచుకునే వీకే.కామ్‌లో ఈ డెత్ గ్రూపులు యువతను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. వెబ్‌సైట్‌లో రహస్యంగా నడుస్తున్న ఈ గ్రూపులు యువత పాలిట యమపాశాలుగా మారాయంటూ గతేడాది ‘నొవయ గజెటా’ వార్తాపత్రిక పరిశోధనలో తేలింది.
డెత్ గ్రూపు సభ్యుల ఒత్తిడితో నవంబర్ 2015 – ఏప్రిల్ 2016 మధ్య మొత్తం 130 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ సాగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆత్మహత్యలకు పురిగొల్పే వారికి కఠిన శిక్షలు విధిస్తామని చెప్పారు. 15 మంది యువకుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపించిన ఒక డెత్ గ్రూపు నిర్వాహకుడు ఫిలిప్ బ్యుడైకిన్(22)ను గతేడాదిలో అరెస్టుచేశారు.