లైవ్ రిపోర్టింగ్ లో మహిళా జర్నలిస్ట్ పై దాడి!
వాషింగ్టన్: అమెరికాలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టుపై దాడి జరిగింది. ఫిలడెల్ఫియాలోని ఓ ప్రైవేట్ చానల్ మహిళా రిపోర్టర్ పై దాడి చేసిన మహిళపై అందరూ మండిపడుతున్నారు. రెండు రోజుల కిందట సిటీ హాల్ లో లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని టెలిముండో ఆఫీస్ వారు తెలిపారు. ఐరిస్ డెల్గాడో గత కొన్నేళ్లుగా జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తోంది. సిటీ హాల్ లో డెల్గాడో టీవీ లైవ్ షోలో భాగంగా రిపోర్టింగ్ చేస్తోంది. ఇంతలో వాహిదా విల్సన్ అనే మహిళా అక్కడికి వచ్చి డెల్గాడోపై దాడి చేయడం ప్రారంభించింది. మహిళా జర్నలిస్ట్ తల, ముఖం భాగాలపై విల్సన్ అకస్మాత్తుగా దాడి చేసింది. చేతిని అడ్డు పెట్టుకుని ఏం జరిగింది, ఎందుకిలా చేస్తున్నావంటూ బాధితురాలు అడుగుతున్నా పట్టించుకోలేదు.
విల్సన్ దాడి చేయడం ప్రారంభించగానే టీవీ చానల్ లో లైవ్ రికార్డింగ్ ఆపేశారు. యాంకర్ రామన్ జయాస్ ఈ విషయాన్ని గమనించి ఓ మై గాడ్ ఇలా జరిగిందేంటని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. వహీదా విల్సన్ ను అరెస్ట్ చేసినట్లు ఫిలడెల్ఫియా జిల్లా ఉన్నతాధికారి వెల్లడించారు. వీడియో సాక్షాల ఆధారంగా మహిళను అరెస్ట్ చేశామని, ఆన్ లైన్ కోర్టు డాక్యుమెంట్లలో విల్సన్ వల్ల ఇతరులకు ప్రాణహాని ఉందని పేర్కొన్నట్లు చెప్పారు. మహిళా జర్నలిస్ట్ డెల్గాడో చికిత్స తీసుకుంది. ఆమె కోలుకోవడానికి కొన్ని రోజులు సమయం పడుతుందని టీవీ చానల్ వారు తెలిపారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు.