ఆ మెసేజ్.. ఉగ్రవాది ఐడెంటీని తెలిపింది!
పారిస్: 'నవంబర్ 13న మీ కొడుకు చనిపోయి అమరుడయ్యాడు'.. ఇది పారిస్ నరమేధం అనంతరం దాదాపు పదిరోజులకు ఫౌయెద్ మహమ్మద్ అగ్గద్ తల్లికి వచ్చిన సందేశమిది. సిరియా నుంచి వచ్చిన ఈ టెక్స్ట్ మెసేజ్ బాటక్లాన్ థియేటర్‌లో దాడులకు పాల్పడిన మూడో ఉగ్రవాది వివరాలను వెల్లడి చేసింది. గత నెల 13న ఉగ్రవాదులు పారిస్ నగరం మీద విరుచుకుపడి 130మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా బాటక్లాన్ థియేటర్ వద్ద జరిగిన నరమేధంలో 80మందికిపైగా చనిపోయారు. ఇక్కడ మొత్తం ముగ్గరు ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇందులో ఇద్దరిని ఫ్రాన్స్ కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులుగా గుర్తించిన పోలీసులు మూడో వాడి ఆచూకీని మాత్రం కనుక్కొనలేకపోయారు.
ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఉంటున్న ఫౌయెద్ మహమ్మద్ అగ్గద్ తల్లికి ఐఎస్ఐఎస్ ఈ సందేశాన్ని పంపింది. ఉగ్రవాద దాడులకు పాల్పడి చనిపోయిన వారిని 'అమరవీరులు'గా పేర్కొంటూ వారి కుటుంబసభ్యులకు ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఈ విధంగా సందేశాలు పంపుతుంది. ఈ నేపథ్యంలో ఆమె ఫ్రాన్స్ పోలీసులకు డీఎన్‌ఏ శాంపిల్స్ ఇచ్చింది. దీంతో బాటక్లాన్ థియేటర్ వద్ద చనిపోయిన మూడో ఉగ్రవాది అగ్గద్ ఆమె కొడుకేనని పోలీసులు ధ్రువీకరించారు. తన వచ్చిన మెసెజ్‌తో ఆమె ముందుకురాకపోయివుంటే అతను ఎవరో తెలిసేది కాదని అగ్గద్ సోదరుడి తరఫు లాయర్ తెలిపారు.
మొత్తానికి పారిస్ నరమేధానికి పాల్పడిన వారిలో చాలామంది యూరిపియన్ పౌరులేనని తెలుస్తున్నది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు నుంచి శిక్షణ తీసుకొని ఈ వీరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఇప్పటివరకు వెల్లడైన ఉగ్రవాదుల వివరాలను బట్టి వీరంతా ఫ్రాన్స్, బెల్జియం చెందినవారని, వీరికి స్థానికంగా ఫ్రెంచ్ భాష మాట్లాడటం వచ్చునని దర్యాప్తులో తేలింది.