ఓ టీవీ ఛానల్ ఓవర్ యాక్షన్, క్షమాపణలు
బ్యాంకాక్: బీభత్సాన్ని సృష్టించిన బ్యాంకాక్ పేలుడు దృశ్యాన్ని యథాతథంగా చూపించేందుకు ప్రయత్నించి థాయ్ టీవీ చిక్కుల్లో పడింది. చివరికి బేషరతుగా క్షమాపణలు చెప్పింది. థాయ్ టెలివిజన్ ప్రతినిధి ఒకరు అనుమానితుని వేషంలో వెళ్లాడు. పేలుళ్ల ఘటనను యథాతథంగా సినిమా లెవల్లో పాత్రధారులతో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. దీనిపై పేలుళ్ల మృతులకు నివాళులర్పించేందుకు అక్కడకు చేరిన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో షూటింగ్ ఆపేసి వెనక్కి వెళ్లిపోయారు. కానీ ఈ సంఘటనపై నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సదరు టీవీ చానల్ యాజమాన్యం చివరకు బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఛానల్ ఎడిటర్ బూన్లెర్ట్ సుప్రపావంచి జరిగిన పొరపాటుకు క్షమించాలంటూ జాతినుద్దేశించి కోరారు. ఈ క్షమాపణలకు సంబంధించిన స్ర్కోలింగ్ను రోజంతా నడిపారు.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బాంబు పేలుడు కేసులో సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కళ్లజోడు, పసుపురంగు టీషర్ట్ ధరించిన నిందితుడి ఊహాచిత్రాన్ని ఆ దేశ అధికారులు విడుదల చేశారు. సోమవారం రాత్రి బ్యాంకాక్ నగరం నడిబొడ్డున బ్రహ్మదేవుడి ఆలయం ప్రాంగణంలో సంభవించిన పేలుడులో 22 మంది మరణించగా, మరో 125 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.