ఆ వాసనకు... విరుగుడు!
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు... వీటన్నింటిలో ఉండే సామాన్య లక్షణమేమిటి? ముక్కుపుటలు అదరగొట్టే దుర్వాసన వెదజల్లే శౌచాలయాలు.. అవేనండి టాయిలెట్లు! డబ్బు మిగుల్చుకునే కక్కుర్తో... సిబ్బంది కొరతో స్పష్టంగా చెప్పలేముగానీ... వాసన మాత్రం నిజం. ఓ స్విట్జర్లాండ్ కంపెనీ ప్రయత్నాలు ఫలిస్తే మాత్రం త్వరలో ఈ కంపునకు మంగళం చెప్పేయవచ్చు. అదెలాగంటారా? ఈ దుర్వాసనను పీల్చేసుకుని సువాసనలు వెదజల్లే సరికొత్త పెర్‌ఫ్యూమ్‌నొకదాన్ని వీరు తయారు చేశారు మరి!
శుభ్రం చేయకపోయినప్పటికీ కొద్దికాలంపాటైనా దుర్వాసనను అరికట్టడం ద్వారా ప్రజలు పబ్లిక్ శౌచాలయాలను విసృ్తతంగా వాడతారని, తద్వారా పారిశుద్ధ్య సమస్య కొద్దిగానైనా తగ్గుతుందని ఈ కంపెనీ అంచనా. భారత్‌తోపాటు, కెన్యా, ఉగాండాల్లోని శౌచాలయాల నుంచి నమూనాలు సేకరించి వాటిద్వారా వెలువడే రసాయనాలను గుర్తించి మరీ తాము కొత్త పెర్‌ఫ్యూమ్‌ను అభివృద్ధి చేశామని కంపెనీ చెబుతోంది. గంధకం వాయువు మోతాదు ఎక్కువగా ఉండటం వల్లనే భారత్‌లోని శౌచాలయాల ద్వారా దుర్గంధం భరించలేనంత ఉంటుందని వీరు తమ పరిశోధనల ద్వారా తేల్చారు కూడా!