సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. బోర్లు, బావుల వద్ద అపరిశుభ్ర వాతావరణం, ఇళ్ల మధ్య చెత్త కుప్పలు, మురుగు కాల్వలలో పారే నీరు రోడ్లపైకి చేరడం వంటి సమస్యలతో పాటు ‘క్లాప్’ మిత్రల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణకు సంబంధించిన సమస్యలను టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారం కోసం అన్ని జిల్లాల్లోని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కార్యాలయాల్లో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి ప్రత్యేక కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపడతారు. ఫిర్యాదు అందిన వెంటనే దానిస్థాయి ప్రకారం 24 గంటల వ్యవధిలో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఈవోపీఆర్‌డీలు, ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారులకు వేర్వేరు స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఏది గుడ్.. ఏది బ్యాడ్?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి
Comments
Please login to add a commentAdd a comment