పుస్తకాల నగరం..!
ఇంటి ముందు ప్రహరీ గోడ.. దానికి ఆనుకుని ఓ షెల్ఫ్.. అందులో పుస్తకాలు.. ఏమిటి ఈ సెటప్ అనుకుంటున్నారా? ఇది సెకండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణం. మరి అమ్మే వ్యక్తి ఎక్కడ అని చూస్తున్నారా? వీటిని విక్రయించడానికి ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ఎవరికి కావాల్సిన పుస్తకాలను వారు తీసుకుని, నిర్దేశిత ధరను అక్కడ ఏర్పాటు చేసిన బాక్సులో వేస్తే సరిపోతుంది.
యూకే వేల్స్ సమీపంలోని ‘హే ఆన్ వై’ అనే పట్టణంలో ఈ ‘హానెస్టీ బుక్‌షాప్స్’ దర్శనమిస్తాయి. ఇక్కడ ఇలాంటి దుకాణాలతోపాటు మామూలు పుస్తకాల షాపులు కూడా వందల సంఖ్యలో ఉంటాయి. అందుకే ఇది పుస్తకాల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఏటా ఈ పట్టణానికి దాదాపు 5 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.
అలాగే ప్రతి ఏటా మే చివర్లో సాహిత్య పండుగ పేరుతో ఓ ఉత్సవం నిర్వహిస్తారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి దాదాపు 80 వేల మంది రచయితలు, సాహిత్యాభిమానులు, పబ్లిషర్లు హాజరవుతారు.