అవును ఆ ఉగ్రవాదిని చంపేశాం: అమెరికా
కాబూల్: అల్ కాయిదా ఉగ్రవాద సంస్థ ముఖ్య నాయకుడు ఫరూక్ అల్ ఖతాని మృతి వార్త నిజమే అని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ శుక్రవారం ధృవీకరించింది. కాబూల్ తూర్పు దిశగా 230 కిలోమీటర్ల దూరంలోని కునార్ ప్రావిన్స్‌లో అక్టోబర్ 23న జరిపిన వైమానిక దాడుల్లో అల్ ఖతాని మృతి చెందాడని పెంటగాన్ వెల్లడించింది. తమపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాదులు, ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికా చేపడుతున్న విజయవంతమైన అపరేషన్స్‌కు ఇదొక ఉదాహరణ అని పెంటగాన్ ప్రకటించింది.
ఆఫ్గన్ ఈశాన్య ప్రాంతంలో అల్ కాయిదాను బలోపేతం చేయడానికి అల్ ఖతాని ప్రయత్నించాడని పెంటగాన్ పేర్కొంది. ఆఫ్గనిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్‌డీఎస్) ఇదివరకే అల్ ఖతానీ మృతి చెందాడని ప్రకటించాయి. మరో అల్ కాయిదా లీడర్ బిలాల్ అల్ ఉతాబి సైతం మృతి చెందాడని ఎన్‌డీఎస్ తెలిపినప్పటికీ పెంటగాన్ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.