
యువతి గాయత్రి మంత్రం.. షరీఫ్ చప్పట్లు
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొలువుదీరిన ఓ కార్యక్రమంలో హిందూ యువతి చక్కగా గాయత్రి మంత్రానికి సంబంధించిన గీతాన్ని పాడి అందరి హృదయాలను దోచుకుంది.
కరాచీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొలువుదీరిన ఓ కార్యక్రమంలో హిందూ యువతి చక్కగా గాయత్రి మంత్రానికి సంబంధించిన గీతాన్ని పాడి అందరి హృదయాలను దోచుకుంది. అక్కడ ఉన్న అంతా ఆమెపై చప్పట్ల వర్షం కురిపించారు. అప్పటి వరకు శ్రద్ధగా విన్న ప్రధాని షరీఫ్ కూడా పాట ముగిసిన తర్వాత చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల (మార్చి) 15న పాకిస్థాన్‌లో మైనారిటీలు అయిన హిందువులు హోలీ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమం ఏర్పాటుచేయగా దానికి ప్రధాని షరీఫ్‌తోపాటు పలువురు ప్రభుత్వ పెద్దలు కూడా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో తొలుత మాట్లాడిన ఆయన హిందువులకు అన్ని రకాల రక్షణను కల్పిస్తామని చెప్పారు. బలవంతంగా ఇస్లాం మతంలోకి హిందువులను మార్చడాన్ని ఖురాన్ అంగీకరించబోదని అన్నారు. పాక్‌లోని మైనారిటీల హక్కులు రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. అనంతరం నరోదా మాలిని అనే బాలిక ఒక్కసారిగా గాయత్రి మంత్రాన్ని గానం చేసి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వేదికపై ఉన్నవారంతా కూడా ఓ రకమైన ఆసక్తికి లోనై పాట పూర్తయ్యే వరకు చాలా చక్కగా విని చప్పట్లతో అభినందించారు.