ఈ ఫొటోలు.. సౌరశక్తి ఫలకాలు
సౌరశక్తి విస్తృత వినియోగానికి ఉన్న ప్రధాన అడ్డంకి సౌరశక్తి ఫలకాల సైజు. వీటిని ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. పైగా ఖర్చూ ఎక్కువే. ఈ ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టేశామంటోంది ఆల్టో యూనివర్సిటీ. పక్కన కనిపిస్తున్నవి.. మామూలు ఫొటోలు మాత్రమే కాదు.. సాధారణ ఇంక్‌జెట్ ప్రింటర్‌తో ముద్రించుకోగల సౌరశక్తి ఫలకాలు కూడా. డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్ పేరుతో ఇలాంటివి ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆల్టో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఫలకాల సామర్థ్యం ఎక్కువ.
వీటిని ఫొటోలుగా, లేదంటే అక్షరాలుగా ముద్రించుకుని సౌరశక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ప్రత్యేకమైన ఇంకును టైటానియం పొరపై ముద్రించడం ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ రకమైన సౌరశక్తి ఫలకాలను అడ్వర్టయిజ్‌మెంట్ హోర్డింగ్‌లపై వాడితే అటు ప్రచారం.. ఇటు కరెంటు ఉత్పత్తి.. రెండు ఉపయోగాలు ఉంటాయన్నమాట. దాదాపు వెయ్యి గంటలపాటు ఏకబిగిన పనిచేయించినా వీటి సామర్థ్యం తగ్గలేదని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఘుఫ్రాన్ హష్మీ తెలిపారు.