'అది ముమ్మాటికి శత్రుచర్యే.. వెన్నుపోటే'
మాస్కో: తమ దేశ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ విధంగానైనా టర్కీ మీద అవకాశం దొరికినప్పుడల్లా పగ తీర్చుకోవాలన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. తమ విమానాన్ని కూల్చివేసిన టర్కీ చర్య ముమ్మాటికీ శత్రు చర్యేనని అన్నారు. ఆ విషయం అంత తేలిగ్గా తీసుకోలేమని, అది ఒక ఫోన్ కాల్ ఎత్తినంత తేలిక కాదని అన్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ను బహిష్కరించాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడులను ఆయన కొట్టి పారేశారు.
గురువారం మాస్కోలో మీడియా సమావేశంలో మాట్లాడిన పుతిన్.. టర్కీపై నిప్పులు చెరిగారు. టర్కీ అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ను దుయ్యబట్టారు. టర్కీ రాజకీయ నాయకత్వంలో ఏదో లోపం ఉందని అన్నారు. ముందు తమతో మాట్లాడకుండా నాటో బలగాలతో టర్కీ అధికారులు సంప్రదింపులు జరపడమేమిటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి వెన్నుపోటేనని చెప్పారు. మమ్మల్ని సంప్రదిస్తే మేమేమన్నా దూరంగా వెళ్లిపోతామా అని ప్రశ్నించారు. మాది అలా పారిపోయే దేశం కాదని అన్నారు.
సిరియాను ఎవరు పరిపాలించాలో తేల్చాల్సింది అంతర్జాతీయ సమాజం కాదని, అక్కడి ప్రజలే తేల్చుకుంటారని, నిబంధనలు, పాలకులు వారి ఇష్టమని అన్నారు. సిరియాలో తమ వాయు సేనలను మరింత పెంచుతున్నామని, ఇస్లామిక్ స్టేట్ పై దాడులు కొనసాగించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. గత నవంబర్ 24న రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చి వేయడంతో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.