downing
-
బోరిస్ జాన్సన్ సన్నిహితుల రాజీనామా
లండన్: పార్టీగేట్ కుంభకోణం బ్రిటిన్ను కుదిపేస్తోంది. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు సన్నిహితులైన నలుగురు ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆరోపణల నుంచి బయటపడేందుకు బోరిస్ జాన్సన్ వారితో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి పాలసీ చీఫ్ మునిరా మీర్జా, చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ రోసెన్ఫీల్డ్, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రెటరీ మార్టిన్ రేనాల్డ్, కమ్యూనికేషన్ డైరెక్టర్ జాక్ డోయెల్ తాజాగా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్(యూకే) అంతటా కఠినమైన ఆంక్షలు అమలవుతున్న సమయంలో ప్రధానమంత్రి అధికార నివాసమైన డౌనింగ్ స్ట్రీట్‌లో విచ్చలవిడిగా విందులు చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. -
విమానంలో 110మంది.. కూల్చేయమన్న పుతిన్
మాస్కో : దాదాపు 110మందితో వెళుతున్న విమానాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 2014లో ఆయన ఈ మేరకు ఉన్నతాధికారులకు సూచించినట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే, వేల సంఖ్యలో ప్రాణాలు రక్షించేందుకే ఆయన అంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పుతిన్ పేరిట ఓ డాక్యుమెంటరీని తాజాగా ప్రదర్శించారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో కూడా లభిస్తోంది. రెండుగంటలపాటు సాగే ఈ వీడియోలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. 2014 ఫిబ్రవరి 7న సొచ్చిలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. వాటిని చూసేందుకు దాదాపు 40వేల మంది ఔత్సాహికులు వచ్చారు. ఆ కార్యక్రమానికి పుతిన్ కూడా వెళ్లాల్సి ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే పుతిన్‌కు నిఘా అధికారుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఖర్కివ్ నుంచి ఇస్తాంబుల్‌కు ప్రయాణిస్తున్న ఓ టర్కీ విమానాన్ని (టర్కీష్ పీగాసస్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737-800) ఉగ్రవాదులు హైజాక్ చేశారని, అందులో ఓ ప్రయాణీకుడికి బాంబు కూడా అమర్చారని, అది ప్రస్తుతం ఒలింపిక్స్ ప్రారంభం కానున్న సొచ్చి వైపు దూసుకొస్తుందని ఆ ఫోన్ కాల్ సమాచారం. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పుతిన్ వెంటనే తన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సత్వరమే చేయాల్సిన దానిపై చర్చించారు. వెంటనే 110 మంది ప్రయాణిస్తున్న ఆ విమానాన్ని కూల్చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 40 వేలమంది ప్రాణాలు కాపాడటం ఎంతో ముఖ్యం అని వారికి చెప్పారు. ఆ తర్వాత ఆయన ఒలింపిక్స్ వద్దకు వెళ్లారు. అయితే, మరికొద్దిసేపటికీ ఆయనకు మరో ఫోన్ కాల్ వచ్చింది.. అంతకు ముందు వచ్చింది కేవలం ఫేక్ బెదిరింపు కాల్ అని, ఓ ప్రయాణీకుడు తాగి విమానంలో గొడవ చేశాడని, ప్రస్తుతం ఆ విమానం టర్కీ వైపే వెళుతుందని చెప్పారు. దీంతో పుతిన్ ఊపిరి పీల్చుకున్నారట. ఈ విషయాన్ని క్లెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కూడా ధ్రువీకరించారు. -
'అది ముమ్మాటికి శత్రుచర్యే.. వెన్నుపోటే'
మాస్కో: తమ దేశ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ విధంగానైనా టర్కీ మీద అవకాశం దొరికినప్పుడల్లా పగ తీర్చుకోవాలన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. తమ విమానాన్ని కూల్చివేసిన టర్కీ చర్య ముమ్మాటికీ శత్రు చర్యేనని అన్నారు. ఆ విషయం అంత తేలిగ్గా తీసుకోలేమని, అది ఒక ఫోన్ కాల్ ఎత్తినంత తేలిక కాదని అన్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ను బహిష్కరించాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడులను ఆయన కొట్టి పారేశారు. గురువారం మాస్కోలో మీడియా సమావేశంలో మాట్లాడిన పుతిన్.. టర్కీపై నిప్పులు చెరిగారు. టర్కీ అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ను దుయ్యబట్టారు. టర్కీ రాజకీయ నాయకత్వంలో ఏదో లోపం ఉందని అన్నారు. ముందు తమతో మాట్లాడకుండా నాటో బలగాలతో టర్కీ అధికారులు సంప్రదింపులు జరపడమేమిటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి వెన్నుపోటేనని చెప్పారు. మమ్మల్ని సంప్రదిస్తే మేమేమన్నా దూరంగా వెళ్లిపోతామా అని ప్రశ్నించారు. మాది అలా పారిపోయే దేశం కాదని అన్నారు. సిరియాను ఎవరు పరిపాలించాలో తేల్చాల్సింది అంతర్జాతీయ సమాజం కాదని, అక్కడి ప్రజలే తేల్చుకుంటారని, నిబంధనలు, పాలకులు వారి ఇష్టమని అన్నారు. సిరియాలో తమ వాయు సేనలను మరింత పెంచుతున్నామని, ఇస్లామిక్ స్టేట్ పై దాడులు కొనసాగించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. గత నవంబర్ 24న రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చి వేయడంతో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.